కీర్తన 116
1 నేను యెహోవాను ప్రేమిస్తాను, ఎందుకంటే ఆయన నా స్వరం విన్నారు;  
కరుణ కోసం నేను పెట్టిన మొరను ఆయన విన్నారు.   
2 ఆయన తన చెవిని నా వైపు త్రిప్పారు కాబట్టి,  
నేను ప్రాణంతో ఉన్నంత వరకు ఆయనకు మొరపెడుతుంటాను.   
   
 
3 మరణపాశాలు నన్ను చుట్టివేశాయి,  
సమాధి వేదన నా మీదికి వచ్చింది.  
బాధ దుఃఖం నన్ను అధిగమించాయి.   
4 అప్పుడు నేను యెహోవా నామమున మొరపెట్టాను:  
“యెహోవా, నన్ను రక్షించండి!”   
   
 
5 యెహోవా దయగలవాడు నీతిమంతుడు;  
మన దేవుడు కనికరం కలవాడు.   
6 యెహోవా సామాన్యులను కాపాడతారు;  
నేను దుర్దశలో ఉన్నప్పుడు, ఆయన నన్ను రక్షించారు.   
   
 
7 నా ప్రాణమా, నీ విశ్రాంతికి తిరిగి వెళ్లు,  
ఎందుకంటే యెహోవా నీ పట్ల గొప్పగా వ్యవహరించారు.   
   
 
8 యెహోవా, మీరు, మరణం నుండి నన్ను,  
కన్నీటి నుండి నా కళ్ళను,  
జారిపడకుండా నా పాదాలను విడిపించారు.   
9 నేను సజీవుల భూమిలో  
యెహోవా ఎదుట నడుస్తాను.   
   
 
10 “నేను చాలా బాధింపబడ్డాను” అని నేను చెప్పినప్పుడు,  
నేను యెహోవాపై నమ్మకం ఉంచాను;   
11 నా కంగారులో నేను,  
“మనుష్యులంతా అబద్ధికులు” అన్నాను.   
   
 
12 యెహోవా నాకు చేసిన అంతటిని బట్టి  
నేను ఆయనకు తిరిగి ఏమివ్వగలను?   
   
 
13 నేను రక్షణ పాత్రను పైకెత్తి  
యెహోవా పేరట మొరపెడతాను.   
14 ఆయన ప్రజలందరి సమక్షంలో,  
నేను యెహోవాకు నా మ్రొక్కుబడులు తీర్చుకుంటాను.   
   
 
15 యెహోవా దృష్టిలో విలువైనది  
ఆయన నమ్మకమైన సేవకుల మరణము.   
16 యెహోవా, నేను మీ సేవకుడిని మీ పనిమనిషి కుమారున్ని,  
నా తల్లి చేసినట్లే నేను మీకు సేవ చేస్తాను;  
మీరు నా సంకెళ్ళ నుండి నన్ను విడిపించారు.   
   
 
17 నేను మీకు కృతజ్ఞతార్పణ అర్పిస్తాను  
యెహోవా నేను మీ పేరట మొరపెడతాను.   
18-19 ఆయన ప్రజలందరి సమక్షంలోను,  
యెహోవా మందిర ఆవరణాల్లోను,  
యెరూషలేమా, మీ మధ్యను,  
నేను యెహోవాకు నా మ్రొక్కుబడులు చెల్లిస్తాను.  
   
 
యెహోవాను స్తుతించండి.