కీర్తన 141
దావీదు కీర్తన. 
 
1 యెహోవా నేను మిమ్మల్ని పిలుస్తున్నాను,  
నా దగ్గరకు త్వరగా రండి;  
నా స్వరాన్ని ఆలకించండి.   
2 నా ప్రార్థన దూపమువలే మీకు అంగీకారమగును గాక;  
నా చేతులు పైకెత్తడం సాయంకాల నైవేద్యంలా ఉండును గాక.   
   
 
3 యెహోవా నా నోటికి కావలి పెట్టండి;  
నా పెదవులు వాకిట కావలి ఉంచండి.   
4 కీడు చేసేవారితో కలిసి  
వారి దుష్ట క్రియలలో నేను పాల్గొనకుండునట్లు,  
నా హృదయాన్ని చెడు వైపు తిరగనివ్వకండి;  
వారి రుచిగల పదార్థాలు నేను తినకుండ ఉండనివ్వండి!   
   
 
5 నీతిమంతులు నన్ను కొట్టడం నామీద దయ చూపడమే;  
వారు నన్ను మందలించడం నాకు తైలాభిషేకమే.  
నా తల దానిని నిరాకరించదు,  
కీడుచేసేవారి క్రియలకు విరుద్ధంగా నా ప్రార్థన మాత్రం మానను.   
   
 
6 వారి పాలకులు కొండలపై నుండి పడద్రోయబడతారు,  
అప్పుడు వారు నా మాటలు నిజమని గ్రహిస్తారు.   
7 “ఒకరు భూమిలో దున్నినట్లు,  
మా ఎముకలు మృత్యులోక ద్వారంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి” అని వారంటారు.   
   
 
8 ప్రభువైన యెహోవా, మీ వైపే నేను చూస్తున్నాను;  
మీయందు నేను ఆశ్రయించాను; నన్ను మరణానికి అప్పగించకండి.   
9 కీడుచేసేవారి ఉచ్చుల నుండి,  
వారు నా కోసం వేసిన వల నుండి నన్ను క్షేమంగా ఉంచండి.   
10 దుష్టులు తమ వలల్లో తామే చిక్కుకుంటారు,  
నేనైతే తప్పించుకు వెళ్తాను.