కీర్తన 149
1 యెహోవాను స్తుతించండి.  
   
 
యెహోవాకు క్రొత్త పాట పాడండి,  
ఆయన యొక్క నమ్మకమైన ప్రజల సమాజంలో స్తుతి పాడండి.   
   
 
2 ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తలో సంతోషించును గాక;  
సీయోను ప్రజలు తమ రాజులో ఆనందించుదురు గాక.   
3 వారు ఆయన నామాన్ని నాట్యం చేస్తూ స్తుతిస్తారు  
తంబురతో సితారాతో గానం చేస్తారు.   
4 యెహోవా తన ప్రజల్లో ఆనందిస్తారు;  
దీనులకు విజయాన్ని కిరీటంగా ధరింపజేస్తారు.   
5 ఆయన యొక్క నమ్మకమైన ప్రజలు ఈ ఘనతలో సంతోషించుదురు గాక.  
వారు వారి పడకలో ఆనందంతో పాడుదురు గాక.   
   
 
6 వారి నోళ్ళలో దేవుని స్తుతి  
వారి చేతుల్లో రెండంచుల ఖడ్గం ఉండును గాక.   
7 దేశాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి  
ప్రజలను శిక్షించడానికి,   
8-9 వారి రాజులను సంకెళ్ళతో,  
ఉక్కు సంకెళ్ళతో వారి సంస్థానాధిపతులను బంధించడానికి,  
వారికి వ్యతిరేకంగా వ్రాయబడిన తీర్పు అమలుచేసేలా ఇది ఉంటుంది,  
ఆయన యొక్క నమ్మకమైన ప్రజలందరికి ఈ ఘనత ఉంటుంది.  
   
 
యెహోవాను స్తుతించండి.