కీర్తన 21
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. 
 
1 యెహోవా! మీ బలంలోనే రాజు ఆనందిస్తాడు.  
మీ రక్షణను బట్టి అతడు ఎంతో సంతోషిస్తాడు!   
   
 
2 అతని హృదయ కోరికను మీరు తీర్చారు  
అతని పెదవుల నుండి వచ్చిన మనవిని మీరు ఇవ్వక మానలేదు. 
సెలా
   
3 మీరు అతనిని గొప్పగా ఆశీర్వదించారు  
మేలిమి బంగారు కిరీటం అతని తలపై పెట్టారు.   
4 అతడు మిమ్మల్ని ఆయుష్షును అడుగగా,  
మీరు అతనికి శాశ్వతకాలం ఉండే దీర్ఘాయువును ఇచ్చారు.   
5 మీరు ఇచ్చిన విజయాల వలన అతని గొప్ప కీర్తి కలిగింది;  
మీరు ఘనతా ప్రభావాలతో అతడిని అలంకరించారు.   
6 నిశ్చయంగా మీరు అతనికి శాశ్వతమైన ఆశీర్వాదాలు ఇచ్చారు  
మీ సన్నిధిలోని ఆనందంతో అతన్ని సంతోష పెట్టారు.   
7 రాజు యెహోవాను నమ్ముతాడు;  
మహోన్నతుని మారని ప్రేమను బట్టి  
అతడు కదలకుండ స్థిరంగా ఉంటాడు.   
   
 
8 మీ చేయి మీ శత్రువులందరినీ పట్టుకుంటుంది;  
మీ కుడిచేయి మీ శత్రువులను ఆక్రమిస్తుంది.   
9 మీరు యుద్ధం చేయడానికి ప్రత్యక్షమైనప్పుడు,  
మీరు వారిని అగ్నిగుండంలో కాల్చివేస్తారు.  
యెహోవా తన ఉగ్రతతో వారిని మ్రింగివేస్తారు,  
ఆయన అగ్ని వారిని దహించి వేస్తుంది.   
10 భూమి మీద వారి సంతానాన్ని మీరు నిర్మూలం చేస్తారు,  
నరులలో వారి సంతతిని నిర్మూలం చేస్తారు.   
11 వారు మీకు వ్యతిరేకంగా కీడు చేయాలని కుట్రపన్నినా  
దుష్ట పన్నాగాలు వేసినా, వారు విజయం సాధించలేరు.   
12 మీరు వారివైపు గురి చూసి విల్లు ఎక్కుపెట్టి  
వారు వెనుతిరిగి వెళ్లేలా చేయగలరు.   
   
 
13 యెహోవా, మీ బలంలో మీరు లేవండి;  
మీ శక్తిని గురించి మేము పాడి స్తుతిస్తాము.