కీర్తన 32
దావీదు ధ్యానకీర్తన. 
 
1 తమ పాపాలు క్షమించబడినవారు  
తమ పాపాలు పరిహరించబడినవారు ధన్యులు.   
2 యెహోవాచేత పాపం లేనివారిగా పరిగణించబడినవారు  
ఆత్మలో మోసం లేనివారు ధన్యులు.   
   
 
3 నేను మౌనంగా ఉండి,  
రోజంతా మూలుగుతూ ఉన్నందుకు  
నా ఎముకలు కృశించాయి.   
4 రాత్రింబగళ్ళు మీ చేయి నాపై  
భారంగా ఉంది;  
వేసవిలో నీరు ఎండిపోయినట్లు  
నాలో సారం యింకి పోయింది. 
సెలా
   
   
 
5 అప్పుడు నేను నా పాపాన్ని మీ దగ్గర ఒప్పుకున్నాను  
నా దోషాన్ని నేను దాచుకోలేదు.  
“యెహోవా ఎదుట  
నా అతిక్రమాలను ఒప్పుకుంటాను” అని ఒప్పుకున్నాను.  
అప్పుడు నా అతిక్రమాన్ని  
మీరు క్షమించారు. 
సెలా
   
   
 
6 మీరు దొరికే సమయంలోనే  
నమ్మకమైన వారంతా మీకు ప్రార్థించుదురు గాక;  
జలప్రవాహాలు ఉప్పొంగినా  
వారిని చేరవు.   
7 నా దాగుచోటు మీరే;  
కష్టాల నుండి మీరే నన్ను కాపాడతారు  
విమోచన గీతాలతో నా చుట్టూ ఆవరించారు. 
సెలా
   
   
 
8 మీరు నడవాల్సిన మార్గాన్ని నేను మీకు ఉపదేశించి నేర్పుతాను;  
మీమీద దృష్టిపెట్టి నేను మీకు సలహా ఇస్తాను.   
9 వివేచనలేని గుర్రంలా  
కంచరగాడిదలా ప్రవర్తించకండి  
కళ్లెంతో పగ్గంతో వాటిని అదుపు చేయాలి  
లేకపోతే మీరు వాటిని వశపరచుకోలేరు.   
10 దుష్టులకు చాలా బాధలు కలుగుతాయి,  
కాని యెహోవాను నమ్ముకున్న వారి చుట్టూ  
ఆయన మారని ప్రేమ ఆవరించి ఉంటుంది.   
   
 
11 నీతిమంతులారా యెహోవాలో ఆనందించి సంతోషించండి.  
యథార్థ హృదయులారా, మీరు పాడండి.