కీర్తన 35
దావీదు కీర్తన. 
 
1 యెహోవా, నాతో వాదించే వారితో వాదించండి;  
నాతో పోరాడే వారితో పోరాడండి.   
2 కవచం ధరించి, డాలు తీసుకుని  
యుద్ధానికి సిద్ధపడి, నాకు సాయం చేయడానికి రండి.   
3 నన్ను వెంటాడుతున్న వారి మీదికి,  
మీ ఈటెను విసరండి  
“నేనే మీ రక్షణ” అని  
మీరు నాతో చెప్పండి.   
   
 
4 నా ప్రాణాన్ని తీయాలని చూసేవారు  
అవమానపాలై సిగ్గుపడుదురు గాక;  
నా పతనానికి కుట్రపన్నిన వారు  
భయపడుదురు గాక.   
5 యెహోవా దూత వారిని తరుముతుండగా  
వారు గాలికి కొట్టుకుపోయే పొట్టులా ఉందురు గాక.   
6 యెహోవా దూత వారిని తరుముతుండగా  
వారి మార్గం చీకటిమయమై జారేదిగా ఉండును గాక.   
   
 
7 కారణం లేకుండా వారు తమ వలను నా కోసం దాచారు  
నన్ను చిక్కించుకోడానికి వారు ఒక గొయ్యి తవ్వారు.   
8 వారికి తెలియకుండానే వారి పైకి నాశనం వచ్చును గాక  
వారు నా కోసం దాచిన వలలో వారే చిక్కుకొందురు గాక!  
నా కోసం త్రవ్విన గొయ్యిలో వారే పడుదురు గాక.   
9 నా ప్రాణం యెహోవాలో ఆనందిస్తుంది  
ఆయన రక్షణలో సంతోషిస్తుంది.   
10 “యెహోవా, నిన్ను పోలినవారెవరు?  
బలవంతుల చేతిలో నుండి మీరు బాధితులను విడిపిస్తారు,  
దోపిడి దొంగల నుండి మీరు దీనులను నిరుపేదలను విడిపిస్తారు”  
అని నా శక్తి అంతటితో నేను అంటాను.   
   
 
11 అబద్ధ సాక్షులు బయలుదేరుతున్నారు;  
నాకు తెలియని విషయాలను గురించి వారు నన్ను ప్రశ్నిస్తారు.   
12 మేలుకు ప్రతిగా వారు నాకు కీడు చేస్తారు,  
నేను ఒంటరి వాడినయ్యాను.   
13 అయినాసరే వారికి జబ్బు చేసినప్పుడు,  
నేను గోనెపట్ట చుట్టుకున్నాను,  
ఉపవాసముండి నన్ను నేను తగ్గించుకున్నాను.  
నా ప్రార్థనలకు జవాబు రానప్పుడు,   
14 వారు నా స్నేహితులో సోదరులో అన్నట్లు  
నేను దుఃఖించాను.  
నా తల్లి కోసం ఏడుస్తున్నట్లు  
నేను దుఃఖంతో క్రుంగిపోయాను.   
15 నేను తడబడినప్పుడు వారు సంతోషంతో సమకూడారు;  
నాకు తెలియకుండానే దుండగులు నా మీదికి వచ్చారు.  
ఆపకుండ వారు నా మీద అపవాదు వేశారు.   
16 భక్తిహీనుల్లా వారు ద్వేషం వెళ్లగ్రక్కుతూ ఎగతాళి చేశారు;  
వారు నన్ను చూసి పళ్ళు కొరికారు.   
   
 
17 ప్రభువా, ఎంతకాలం మీరిలా చూస్తూ ఉంటారు?  
వారి విధ్వంసం నుండి నన్ను కాపాడి,  
ఈ సింహాల నుండి నా విలువైన ప్రాణాన్ని విడిపించండి.   
18 మహా సమాజంలో నేను మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను;  
అనేకమంది ప్రజలమధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను.   
19 కారణం లేకుండా నాకు శత్రువులైనవారిని  
నన్ను చూసి సంతోషించనివ్వకండి.  
కారణం లేకుండా నన్ను ద్వేషించేవారు  
దురుద్దేశంతో కన్నుగీట నివ్వకండి.   
20 వారు సమాధానంగా మాట్లాడరు,  
దేశంలో ప్రశాంతంగా నివసించే వారిపై  
తప్పుడు ఆరోపణలు చేస్తారు.   
21 వారు నన్ను వెక్కిరిస్తూ  
“ఆహా! ఆహా! మా కళ్లతో మేము చూశాం” అని అంటారు.   
   
 
22 యెహోవా, ఇదంతా మీరు చూశారు; మౌనంగా ఉండకండి.  
ప్రభువా, నాకు దూరంగా ఉండకండి.   
23 మేల్కొనండి, నన్ను రక్షించడానికి లేవండి!  
నా దేవా, నా ప్రభువా, నా పక్షాన వాదించండి.   
24 యెహోవా, నా దేవా! మీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చండి;  
నన్ను బట్టి వారిని ఆనందించనివ్వకండి.   
25 “ఆహా, మేము కోరుకున్నదే జరిగింది!” అని అనుకోనివ్వకండి,  
“మేము అతన్ని మ్రింగివేశాం” అని అననివ్వకండి.   
   
 
26 నా బాధను చూసి ఆనందిస్తున్న వారందరు  
అవమానంతో సిగ్గుపడాలి;  
నా మీద గర్వించే వారందరు  
సిగ్గుతో అపకీర్తి పాలవుదురు గాక.   
27 నా నిర్దోషత్వాన్ని బట్టి ఆనందించేవారు  
ఆనంద సంతోషాలతో కేకలు వేయుదురు గాక;  
“తన సేవకుని క్షేమాన్ని చూసి ఆనందించే యెహోవా  
ఘనపరచబడును గాక” అని వారు నిత్యం అందురు గాక.   
   
 
28 నా నాలుక మీ నీతిని ప్రకటిస్తుంది,  
దినమంతా మిమ్మల్ని స్తుతిస్తుంది.