కీర్తన 40
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. 
 
1 యెహోవా కోసం ఓర్పుతో ఎదురుచూశాను;  
ఆయన నా వైపు తిరిగి నా మొరను ఆలకించారు.   
2 నాశనకరమైన గుంటలో నుండి నన్ను పైకి లేపారు,  
బురద ఊబిలో నుండి లేపి  
నా పాదాలను బండ మీద నిలిపారు.  
నిలబడడానికి నాకు స్థిరమైన స్థలాన్ని ఇచ్చారు.   
3 మన దేవునికి ఒక స్తుతి పాటను,  
ఆయన నా నోట ఒక క్రొత్త పాట ఉంచారు.  
అనేకులు ఆయన చేసింది చూసి ఆయనకు భయపడతారు.  
వారు యెహోవాలో నమ్మకం ఉంచుతారు.   
   
 
4 గర్విష్ఠుల వైపు చూడక  
అబద్ధ దేవుళ్ళ వైపు తిరుగక,  
యెహోవాలో నమ్మకముంచినవారు ధన్యులు.   
5 యెహోవా నా దేవా,  
మీరు మాకోసం ఎన్నో అద్భుతాలు చేశారు,  
ఎన్నో ప్రణాళికలు వేశారు.  
మీతో పోల్చదగిన వారు లేరు;  
మీ క్రియల గురించి నేను చెప్పాలనుకుంటే  
అవి లెక్కకు మించినవి.   
   
 
6 బలిని అర్పణను మీరు కోరలేదు,  
కాని మీరు నా చెవులు తెరిచారు,  
హోమాలు పాపపరిహార బలులు మీరు కోరలేదు.   
7 అప్పుడు నేను ఇలా అన్నాను, “ఇదిగో నేను ఉన్నాను.  
గ్రంథపుచుట్టలో నా గురించి వ్రాసి ఉంది.   
8 నా దేవా, మీ చిత్తం నెరవేర్చడమే నాకు సంతోషం;  
మీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంది.”   
   
 
9 యెహోవా! మీకు తెలిసినట్టుగా,  
నేను నా పెదవులు మూసుకోకుండ  
మహా సమాజంలో మీ నీతిని గురించిన సువార్త ప్రకటించాను.   
10 మీ నీతిని నా హృదయంలో నేనేమి దాచుకోను;  
మీ విశ్వసనీయతను మీ రక్షణ సహాయాన్ని గురించి నేను మాట్లాడతాను.  
మీ మారని ప్రేమను, మీ నమ్మకత్వాన్ని గురించి  
మహా సమాజానికి చెప్పకుండ దాచిపెట్టను.   
   
 
11 యెహోవా, మీ కరుణను నాకు దూరం చేయకండి;  
మీ మారని ప్రేమ మీ విశ్వాస్యత నిత్యం నన్ను కాపాడును గాక.   
12 లెక్కలేనన్ని ఆపదలు నన్ను చుట్టి ఉన్నాయి;  
నా పాపాలు నన్ను పట్టుకున్నాయి,  
నేనేమి చూడలేని స్థితిలో ఉన్నాను.  
అవి నా తలవెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నాయి,  
నా గుండె చెదిరిపోతుంది.   
13 యెహోవా, సంతోషంగా నన్ను రక్షించడానికి,  
యెహోవా నాకు సాయం చేయడానికి త్వరగా రండి.   
   
 
14 నా ప్రాణం తీయాలని కోరేవారందరు  
సిగ్గుకు, గందరగోళానికి గురవ్వాలి;  
నా పతనాన్ని కోరేవారందరు  
అవమానంతో వెనుకకు తిరిగి వెళ్లాలి.   
15 నన్ను చూసి, “ఆహా! ఆహా!” అనేవారు  
వారికి కలిగే అవమానానికి ఆశ్చర్యానికి గురి కావాలి.   
16 అయితే మిమ్మల్ని వెదికేవారంతా  
మీలో ఆనందించి సంతోషించాలి;  
మీ రక్షణను ప్రేమించేవారు ఎల్లప్పుడు,  
“యెహోవా గొప్పవాడు!” అని అనాలి.   
   
 
17 కాని నా మట్టుకైతే, నేను దీనుడను, అవసరతలో ఉన్నవాడను;  
ప్రభువు నా గురించి ఆలోచించుదురు గాక.  
మీరే నా సహాయం, నా విమోచకుడు;  
మీరే నా దేవుడు, ఆలస్యం చేయకండి.