రెండవ గ్రంథము  
 42
కీర్తనలు 42–72  
సంగీత దర్శకునికి. కోరహు కుమారులు రచించిన ధ్యానకీర్తన. 
 
1 నీటి వాగుల కోసం దుప్పి ఆశపడునట్లు,  
నా దేవా, మీ కోసం నా ప్రాణం ఆశపడుతుంది.   
2 నా ప్రాణం దేవుని కోసం సజీవుడైన దేవుని కోసం దప్పికతో ఉన్నది.  
నేనెప్పుడు ఆయన సన్నిధికి వెళ్లి ఆయనను కలుస్తాను?   
3 “మీ దేవుడు ఎక్కడున్నాడు?”  
అని నా శత్రువులు నాతో అంటూ ఉంటే రాత్రింబగళ్ళు,  
నా కన్నీరే నాకు ఆహారం అవుతున్నాయి.   
4 ఒకప్పుడు జనసమూహంతో కలిసి  
పెద్ద ఊరేగింపుగా,  
ఆనందోత్సాహాలతో స్తుతులు చెల్లిస్తూ  
దేవుని మందిరానికి ఎలా వెళ్లేవాడినో  
జ్ఞాపకం చేసుకుని  
నా ప్రాణం నాలో క్రుంగిపోతుంది.   
   
 
5 నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు?  
నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు?  
దేవుని మీద నిరీక్షణ ఉంచు,  
ఆయనే నా రక్షకుడు నా దేవుడు,  
నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను.   
   
 
6 నా దేవా, ఈ బరువు మోయలేక నా మనస్సు క్రుంగిపోయింది;  
యొర్దాను ప్రాంతం నుండి  
హెర్మోను పర్వత శిఖరాల నుండి మిసారు గుట్టలపై నుండి  
నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను.   
7 మీ ప్రవాహాల గర్జనతో  
అగాధం అగాధాన్ని పిలుస్తుంది;  
మీ తరంగాలు అలలు  
నా మీదుగా పొర్లి పారుతున్నాయి.   
   
 
8 పగటివేళ యెహోవా తన మారని ప్రేమ కుమ్మరిస్తారు,  
రాత్రివేళ ఆయన పాట నాకు తోడై ఉండి  
నా జీవదాతయైన దేవునికి ఒక ప్రార్థనగా ధ్వనిస్తుంది.   
   
 
9 నా కొండ అయిన దేవునితో,  
“మీరు నన్నెందుకు మరచిపోయారు?  
శత్రువులు నన్ను అణగద్రొక్కుతుంటే  
శోకంతో నేనెందుకిలా వెళ్లాలి?” అని మొరపెట్టాను.   
10 రోజుంతా అదే పనిగా నా విరోధులు,  
“మీ దేవుడెక్కడ?” అని అంటూ  
నన్ను గేలి చేస్తూ ఉంటే  
నా ఎముకలు మరణ బాధ అనుభవిస్తున్నాయి.   
   
 
11 నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు?  
నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు?  
దేవుని మీద నిరీక్షణ ఉంచు,  
ఆయనే నా రక్షకుడు నా దేవుడు  
నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను.