కీర్తన 64
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. 
 
1 నా దేవా, నా ఫిర్యాదు వినండి;  
శత్రువు భయం నుండి నా జీవితాన్ని కాపాడండి.   
   
 
2 దుష్టుల కుట్ర నుండి,  
కీడుచేసేవారి పన్నాగాల నుండి నన్ను దాచండి.   
3 వారు తమ నాలుకలను ఖడ్గాల్లా పదునుపెడతారు  
మరణకరమైన బాణాల వంటి క్రూరమైన పదాలను లక్ష్యంగా చేసుకుంటారు.   
4 చాటున ఉండి నిర్దోషుల మీదికి బాణాలు విసురుతారు.  
వారు భయం లేకుండా, అకస్మాత్తుగా బాణాలు విసురుతారు.   
   
 
5 కీడు తలపెట్టడంలో వారు ఒకరినొకరు ప్రోత్సహిస్తారు.  
వారు తమ వలలను దాచడం గురించి మాట్లాడతారు;  
వారంటారు, “దీన్ని ఎవరు చూస్తారు?”   
6 వారు అన్యాయాలను రూపొందించి అంటారు,  
“మేము ఒక సంపూర్ణ ప్రణాళికను రూపొందించాము!”  
నిశ్చయంగా మానవుల మనస్సు హృదయం మోసపూరితమైనవి.   
   
 
7 కాని, దేవుడు తన బాణాలను వాళ్ళ మీదికి విసురుతారు;  
వారు అకస్మాత్తుగా కొట్టబడతారు.   
8 ఆయన వారి సొంత నాలుకలను వారికే వ్యతిరేకంగా మార్చి  
వారిని పతనానికి తెస్తారు;  
వారిని చూసేవారందరూ ఎగతాళిగా తలాడిస్తారు.   
9 మనుష్యులందరు భయపడతారు;  
దేవుడు చేసిన క్రియలను వారు ప్రకటిస్తారు  
ఆయన చేసిన దానిని గ్రహిస్తారు.   
   
 
10 నీతిమంతులు యెహోవాయందు ఆనందించుదురు గాక.  
ఆయననే ఆశ్రయించెదరు గాక.  
యథార్థ హృదయులను ఆయన ఘనపరచుదురు గాక!