కీర్తన 74
ఆసాపు ధ్యానకీర్తన. 
 
1 దేవా, మమ్మల్ని శాశ్వతంగా ఎందుకు తిరస్కరించారు?  
మీ పచ్చికలోని గొర్రెల మీద మీ కోపం ఎందుకు రగులుకొంది?   
2 మీ స్వాస్థ్య గోత్రాన్ని మీరు పూర్వం సంపాదించుకుని  
విమోచించిన మీ వారసత్వ సమాజాన్ని,  
మీరు నివసించిన సీయోను పర్వతాన్ని జ్ఞాపకం చేసుకోండి.   
3 ఈ నిత్య శిధిలాల వైపు,  
శత్రువు పరిశుద్ధాలయం మీదికి తెచ్చిన ఈ విధ్వంసం అంతటి వైపు  
మీ అడుగులు తిప్పండి.   
   
 
4 మీరు మాతో కలిసిన ప్రదేశంలో మీ శత్రువులు గర్జించారు;  
వారు తమ ధ్వజాలను సంకేతాలుగా ఏర్పరచుకున్నారు.   
5 దట్టమైన పొదలను నరికే పురుషుల్లా  
వారు గొడ్డళ్ళు పట్టుకున్నారు.   
6 చెక్కిన పలకను వారు  
తమ గొడ్డళ్ళతో చేతిగొడ్డళ్ళతో పగల కొట్టారు.   
7 మీ పవిత్రాలయానికి నిప్పు పెట్టి నేలమట్టం చేశారు;  
మీ నామం కలిగియున్న నివాస స్థలాన్ని అపవిత్రం చేశారు.   
8 వారు తమ హృదయాల్లో, “దేవుని ఆరాధన స్థలాలను పూర్తిగా ధ్వంసం చేద్దాం!” అనుకుని,  
దేశంలో దేవుడు ఆరాధించబడే ప్రతీ స్థలాన్ని తగలబెట్టారు.   
   
 
9 దేవుని నుండి మాకు ఏ సంకేతాలు లేవు;  
ప్రవక్తలు లేరు గతించిపోయారు,  
ఇదంతా చివరికి ఏమవుతుందో చెప్పే వాడెవడూ మా మధ్యలేడు.   
10 దేవా, ఎంతకాలం శత్రువు మిమ్మల్ని వెక్కిరిస్తాడు?  
శత్రువు శాశ్వతంగా మీ పేరును దూషిస్తాడా?   
11 మీరు ఎందుకు మీ కుడిచేతిని వెనక్కి తీసుకున్నారు?  
జీవబల ప్రభావాలను ఎందుకు ఉపసంహరించుకున్నారు?  
పిడికిలి బిగించి, చేయి చాచి వారిని దెబ్బకొట్టు. నాశనం చేయి!   
   
 
12 అతి ప్రాచీన కాలం నుండి దేవుడే నా రాజు;  
దేశమంతా మీరే నాకు మహారక్షణ అనుగ్రహించావు.   
   
 
13 ఎర్ర సముద్రాన్ని మీ బలం చేత రెండు పాయలుగా విభజించావు,  
సముద్ర దేవత తలల్ని చితకకొట్టావు.   
14 లెవియాథన్ తలలను చితక్కొట్టింది మీరే  
మహా మొసలి తల చితుక కొట్టావు.   
15 మీ ఆజ్ఞమేరకు నీటిబుగ్గలు నదులు ప్రజలకు మీరు సరఫరా చేశారు.  
జీవనది యొర్దాను ప్రవాహాన్ని ఇంకి పోయేట్టు చేసి వారికి దారి ఏర్పరచింది.   
16 పగలు మీదే. రాత్రి కూడా మీదే.  
వెలిగే నక్షత్రాలు మీవే! సూర్యున్ని మీరే చేశారు.   
17 సమస్త ప్రకృతి మీ చేతుల్లో ఉంది.  
మీరే వేసవికాలం చలికాలం ఏర్పరిచారు.   
   
 
18 దేవా! ఈ శత్రువులు నిన్ను ఎలా ఎగతాళి చేస్తున్నారో చూడు.  
ఓ యెహోవా దేవా! ఈ మూర్ఖపు జనం మీ నామాన్ని దూషించారు జ్ఞాపకం తెచ్చుకోండి.   
19 మీ పావురపు ప్రాణాన్ని అడవి జంతువులకు అప్పగించవద్దు;  
నీ బాధించబడిన ప్రజల జీవితాలను ఎప్పటికీ మరచిపోవద్దు.   
20 మీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో,  
దేశమంతా చీకటితో నిండి ఉంది. క్రూరులతో నిండి ఉంది.   
21 నలిగినవారిని మరల అపకీర్తి పాలు కానివ్వకండి.  
బీదలు అవసరతలో ఉన్న ఈ ప్రజలు మీ నామం స్తుతించుదురు గాక.   
22 దేవా, లేచి, మీ కారణాన్ని సమర్థించండి;  
బుద్ధిహీనులు రోజంతా మిమ్మల్ని ఎగతాళి చేసేది జ్ఞాపకముంచుకోండి.   
23 మీ విరోధుల గొడవను,  
నిరంతరం పెరిగే మీ శత్రువుల గందరగోళాన్ని విస్మరించవద్దు.