3
ప్రథమ అపొస్తలిక అద్భుతం
1 మధ్యాహ్నం మూడు గంటల ప్రార్థన సమయంలో పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తూ ఉన్నారు.
2 పుట్టినప్పటి నుండి కుంటివాడుగా ఉన్న ఒకణ్ణి కొందరు ప్రతిరోజూ మోసుకొచ్చి ‘సౌందర్యం’ అనే దేవాలయ ద్వారం దగ్గర ఉంచేవారు. వాడు దేవాలయంలోకి వెళ్ళేవారి దగ్గర బిచ్చమెత్తుకునే వాడు.
3 పేతురు యోహాను దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉండగా వారిని బిచ్చమడిగాడు.
4 పేతురు యోహాను వాడిని తదేకంగా చూస్తూ, “మా వైపు చూడు” అన్నారు.
5 అతడు వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని ఆశించి వారివైపు చూశాడు.
6 అప్పుడు పేతురు, “వెండి బంగారాలు నా దగ్గర లేవు, నాకున్న దాన్నే నీకిస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడువు” అని
7 వాడి కుడి చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. వెంటనే వాని పాదాలూ, చీలమండలూ బలం పొందాయి.
8 వాడు వెంటనే లేచి నడవడం మొదలు పెట్టాడు. నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో పాటు దేవాలయంలోకి వెళ్ళాడు.
9 వాడు నడుస్తూ దేవుణ్ణి కీర్తించడం ప్రజలందరూ చూశారు.
10 ‘సౌందర్యం అనే దేవాలయ ద్వారం దగ్గర అడుక్కోడానికి కూర్చున్నవాడు వీడే’ అని గుర్తుపట్టి, అతనికి జరిగిన దాన్ని చూసి ఆశ్చర్యంలో, విస్మయంలో మునిగిపోయారు.
11 వాడు పేతురు, యోహానులను అంటిపెట్టుకుని ఉండగా చూసిన జనమంతా విస్మయం చెంది, సొలొమోను మంటపంలో ఉన్నవారి దగ్గరికి పరుగెత్తుకు వచ్చారు.
పేతురు రెండవ ఉపన్యాసం: నిబంధన నెరవేర్పు
12 పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలీయులారా, దీని గురించి మీరెందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తితోనో, భక్తితోనో ఇతడు నడిచేలా చేశామన్నట్టు మీరెందుకు మా వైపు అదేపనిగా చూస్తున్నారు?
13 అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, అంటే మన పూర్వికుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పరిచాడు. అయితే మీరాయన్ని పిలాతుకు అప్పగించారు, అతడు ఆయనను విడుదల చేయడానికి నిశ్చయించుకున్నపుడు మీరు అతని ముందు ఆయనను తిరస్కరించారు.
14 పవిత్రుడూ నీతిమంతుడైన వాణ్ణి మీరు తిరస్కరించి, హంతకుణ్ణి మీకోసం విడుదల చేయాలని అడిగారు.
15 మీరు జీవానికి కర్తను చంపించారు కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు. అందుకు మేమే సాక్షులం.
16 ఆయన నామంలో ఉంచిన విశ్వాసమే మీరు చూసి ఎరిగిన ఇతనిని బలపరచింది, యేసుపై ఉన్న విశ్వాసమే మీ అందరి ముందు ఇతనికి ఈ సంపూర్ణ స్వస్థత కలిగించింది.
17 సోదరులారా, మీరూ మీ నాయకులూ తెలియక చేశారని నాకు తెలుసు.
18 అయితే తన క్రీస్తు తప్పక బాధల పాలు కావాలని దేవుడు ప్రవక్తలందరి ద్వారా ముందే తెలియజేసిన సంగతులను ఆయన ఇప్పుడు ఈ విధంగా నెరవేర్చాడు.
19 కాబట్టి మీ పాపాల ప్రక్షాళన కోసం పశ్చాత్తాపపడి తిరగండి. అప్పుడు ప్రభువు సన్నిధి నుండి విశ్రాంతి కాలాలు వస్తాయి.
20 అభిషిక్తుడైన క్రీస్తు యేసును మీ కోసం ఆయన పంపుతాడు. మీ పాపాలు తుడిచి వేస్తాడు.
21 అన్నిటికీ పునరుద్ధరణ సమయం వస్తుందని దేవుడు లోకారంభం నుండి తన పరిశుద్ధ ప్రవక్తల చేత చెప్పించాడు. అంతవరకూ యేసు పరలోకంలో ఉండడం అవసరం.
22 మోషే నిజంగా ఇలా అన్నాడు కదా, ‘ప్రభువైన దేవుడు నాలాంటి ఒక ప్రవక్తను మీ సొంత ప్రజల్లో నుండి మీకోసం పుట్టిస్తాడు. ఆయన మీతో చెప్పేదంతా మీరు తప్పకుండా వినాలి.’
23 ఆ ప్రవక్త చెప్పినదాన్ని పెడచెవిన పెట్టేవాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమై పోతాడు.
24 “సమూయేలుతో మొదలుపెట్టి మిగతా ప్రవక్తలంతా ఈ రోజుల గురించి ముందుగానే చెప్పారు.
25 ‘నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న కుటుంబాలన్నిటినీ ఆశీర్వదిస్తాను’ అని దేవుడు అబ్రాహాముతో చెప్పినట్టుగా మీరు ప్రవక్తలకూ నిబంధనకూ వారసులు. ఆ నిబంధనను దేవుడు మీ పూర్వికులతో చేశాడు.
26 దేవుడు తన సేవకుని లేవనెత్తి, మీలో ప్రతివానినీ వాని దుష్టత్వం నుండి తప్పించడం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయనను మొదట మీ దగ్గరికి పంపాడు.”