4
హింసలు ఆరంభం
పేతురు యోహానులు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నపుడు యాజకులూ, ద్వారపాలకుల అధికారీ, సద్దూకయ్యులూ వారి దగ్గరికి వచ్చారు. వారు యేసుని గూర్చి బోధిస్తూ ఆయన చనిపోయి తిరిగి లేచాడని ప్రకటించడం విని కలవరపడ్డారు. వారిని బలవంతంగా పట్టుకుని, సాయంకాలం అయిందని మరునాటి వరకూ వారిని ఖైదులో ఉంచారు. కానీ వాక్కు విన్న వారిలో చాలామంది నమ్మారు. వారిలో పురుషుల సంఖ్య దాదాపు ఐదు వేలు.
సన్హెడ్రిన్ సభ ఎదుటికి పేతురు
మరుసటి రోజు వారి అధికారులూ పెద్దలూ ధర్మశాస్త్ర పండితులూ యెరూషలేములో సమావేశమయ్యారు. ప్రధాన యాజకుడైన అన్న, కయప, యోహాను, అలెగ్జాండర్, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో ఉన్నారు. వారు పేతురు యోహానులను వారి మధ్యలో నిలబెట్టి, “మీరు ఏ అధికారంతో ఏ నామంలో దీన్ని చేశారు?” అని అడిగారు. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇలా అన్నాడు, “ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ కుంటివాడికి చేసిన మంచి పని గురించి, వాడెలా బాగుపడ్డాడని ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా. 10 మీరూ, ఇశ్రాయేలు ప్రజలంతా తెలుసుకోవలసింది ఏమంటే, మీరు సిలువ వేసిన, మృతుల్లో నుండి దేవుడు లేపిన నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్నే వీడు బాగుపడి మీ ముందు నిలుచున్నాడు. 11 ఇల్లు కట్టే మీరు వదిలేసిన రాయి ఆయనే. ఆ రాయి భవనానికి ఆధారశిల అయ్యింది. 12 ఎవ్వరివల్లా రక్షణ రాదు. ఈ నామంలోనే మనం రక్షణ పొందాలి గాని, ఆకాశం కింద ఉన్న మనుషుల్లోని మరి ఏ నామంలోనూ రక్షణ పొందలేము.”
యేసు నామం ప్రకటించడం నిషేధం
13 వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వారు చదువులేని సామాన్యులని తెలుసుకుని ఆశ్చర్యపడి, వారు యేసుతో ఉండేవారు అని గుర్తించారు. 14 బాగుపడ్డ ఆ వ్యక్తి వారితోపాటు నిలబడడం చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు.
15 అధికారులు సభాస్థలం నుంచి బయటికి వెళ్ళండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసుకుని, 16 ‘ఈ మనుషులను మనమేం చేద్దాం? వారిద్వారా గొప్ప అద్భుతం జరిగిందని యెరూషలేములో నివసిస్తున్న వారందరికీ తెలుసు, అది జరగలేదని చెప్పలేం. 17 అయినా ఇది జనాల్లోకి యింకా వ్యాపించకుండా, ఇకనుండి ఈ నామంతో ఎవరితోనూ మాట్లాడవద్దని మనం వారిని బెదిరిద్దాం’ అని చెప్పుకున్నారు.
18 అప్పుడు వారిని పిలిపించి, “మీరు యేసు నామంలో ఏ మాత్రం మాట్లాడకూడదు, బోధించకూడదు” అని వారికి ఆజ్ఞాపించారు. 19 అందుకు పేతురు యోహానులు వారిని చూసి, “దేవుని మాట కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమేనా? మీరే చెప్పండి. 20 మేమేం చూశామో, ఏమి విన్నామో వాటిని చెప్పకుండా ఉండలేము” అని వారికి జవాబిచ్చారు.
21 ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుని కొనియాడుతున్నారు కాబట్టి సభవారు వీరిని ఎలా శిక్షించాలో తెలియక గట్టిగా బెదరించి విడుదల చేశారు. 22 అద్భుతంగా బాగుపడిన వాడి వయస్సు నలభై ఏళ్ళు పై మాటే.
విశ్వాసులు మళ్లీ ఆత్మతో నిండిపోవడం
23 పేతురు యోహానులు విడుదలై తమ సొంతవారి దగ్గరికి వచ్చి, ప్రధాన యాజకులూ పెద్దలూ తమతో చెప్పిన మాటలన్నీ వారికి చెప్పారు. 24 వారు విని, ఒకే మనసుతో దేవునికిలా గొంతెత్తి మొరపెట్టారు. ‘ప్రభూ, నీవు ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలోని సమస్తాన్నీ కలుగజేశావు.
25 యూదేతరులు ఎందుకు అల్లరి చేశారు?
ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు?
26 ప్రభువు మీదా ఆయన క్రీస్తు మీదా భూరాజులు లేచారు,
అధికారులు ఏకమయ్యారు
అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా, నీ సేవకుడూ, మా తండ్రీ అయిన దావీదుతో చెప్పించావు.
27 ఏవి జరగాలని నీవు సంకల్పించి ముందుగానే నిర్ణయించావో, వాటన్నిటినీ చేయడానికి నీవు అభిషేకించిన నీ పవిత్ర సేవకుడైన యేసుకు విరోధంగా 28 హేరోదు, పొంతి పిలాతు, యూదేతరులు, ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఈ పట్టణంలో ఒక్కటయ్యారు. 29 ప్రభూ, వారి బెదరింపులు గమనించి రోగులను బాగుచేయడానికీ, నీ పవిత్ర సేవకుడైన యేసు నామంలో సూచక క్రియలనూ, మహత్కార్యాలనూ చేయడానికీ నీ చెయ్యి చాపి ఉండగా, 30 నీ సేవకులు బహు ధైర్యంగా నీ వాక్కు బోధించేలా అనుగ్రహించు.’ 31 వారు ప్రార్థన చేయగానే వారు సమావేశమై ఉన్న చోటు కంపించింది. అప్పుడు వారంతా పరిశుద్ధాత్మతో నిండిపోయి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు.
యెరూషలేములో దేవుని సంఘం
32 విశ్వసించిన వారంతా ఏక హృదయం, ఏకాత్మ కలిగి ఉన్నారు. ఎవరూ తన ఆస్తిపాస్తుల్లో ఏదీ తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు. 33 అపొస్తలులు గొప్ప ప్రభావంతో ప్రభువైన యేసు పునరుత్థానాన్ని గురించి సాక్షమిచ్చారు. గొప్ప దైవ కృప అందరినీ ఆవరించింది. 34 భూములూ ఇళ్ళూ ఉన్నవారంతా వాటిని అమ్మేసి, ఆ డబ్బు అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. 35 వారు ప్రతివారికీ అవసరం చొప్పున పంచి పెట్టారు కాబట్టి వారిలో ఎవరికీ కొదువ లేకపోయింది.
36 సైప్రస్ దీవికి చెందిన యోసేపు అనే ఒక లేవీయునికి అపొస్తలులు ‘బర్నబా’ అనే పేరు పెట్టారు. ఆ పేరుకు అర్థం ‘ఆదరణ పుత్రుడు.’ 37 ఇతడు తనకున్న పొలం అమ్మేసి ఆ డబ్బు తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.