15
మోషే మిర్యాముల కీర్తన
1 అప్పుడు మోషే, ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను ఇలా కీర్తించారు. “యెహోవాను గురించి పాడతాను. ఆయన శత్రువు గుర్రాన్నీ, రౌతునూ,
సముద్రంలో ముంచి వేశాడు.
గొప్ప విజయం సాధించాడు.
2 యెహోవాయే నా బలం, నా గానం,
నా రక్షణకర్త. ఆయన నా దేవుడు, ఆయనను స్తుతిస్తాను.
ఆయన నా పూర్వీకుల దేవుడు, ఆయనను ఘనపరుస్తాను.
3 యెహోవా యుద్ధశూరుడు, ఆయన పేరు యెహోవా.
4 ఆయన ఫరో రథాలను, సైన్యాన్ని సముద్రంలో ముంచివేశాడు.
సైన్యాధిపతుల్లో ప్రముఖులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు.
5 రాళ్లవలె వాళ్ళు నడి సముద్రం అడుక్కి చేరుకున్నారు.
6 యెహోవా, నీ కుడి చెయ్యి బలిష్ఠమైనది. యెహోవా, నీ కుడిచెయ్యి శత్రువుని అణిచి వేస్తుంది.
7 నీకు విరోధంగా నీపై లేచేవాళ్లను నీ మహిమా ప్రకాశంతో అణచి వేస్తావు.
నీ కోపాగ్ని రగిలినప్పుడు వాళ్ళు చెత్తలాగా కాలిపోతారు.
8 నీ ముక్కుపుటాల నుండి వెలువడిన పెనుగాలికి నీళ్లు కుప్పగా నిలబడిపోయాయి. ప్రవాహాలు గోడలాగా నిలబడి పోయాయి.
సముద్రం లోతుల్లో నీళ్ళు గడ్డకట్టిపోయాయి.
9 ‘వాళ్ళను తరిమి నా కత్తి దూసి నాశనం చేసి దోచుకున్న సొమ్ముతో నా కోరిక తీర్చుకుంటాను’ అని శత్రువు అనుకున్నాడు.
10 నువ్వు నీ గాలి విసిరి లోతైన నీళ్ళలో సీసం లాగా వాళ్ళను మునిగి పోయేలా చేశావు.
11 పూజింపదగ్గ వాళ్ళలో యెహోవాలాంటివాడు ఎవడు? పవిత్రత వైభవంలో నీ వంటి వాడెవడు? స్తుతికీర్తనలతో ఘనపరచదగిన వాడు, అద్భుతాలు చేసే నీవంటి వాడెవడు?
12 నీ కుడి చెయ్యి చాపినప్పుడు వాళ్ళను భూమి మింగివేసింది.
13 నీ కనికరం వల్ల ఈ ప్రజలను విడిపించి నీ శక్తి ద్వారా నీ సన్నిధికి తీసుకువచ్చావు.
14 ఈ సంగతి ఇతర ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళు భయపడతారు. అది ఫిలిష్తీయులకు భయం కలిగిస్తుంది.
15 ఎదోము అధిపతులు భయపడతారు. మోయాబులో బలిష్ఠులు వణికిపోతారు. కనానులో నివసించే వారు భయంతో నీరసించి పోతారు,
16 భయ భీతులు వారిని ఆవరిస్తాయి. యెహోవా, నీ ప్రజలు అవతలి తీరం చేరే వరకూ నీ హస్తబలం చేత శత్రువులు రాళ్ళ వలే కదలకుండా నిలిచిపోతారు.
17 నువ్వు నీ ప్రజలకు స్థిర నివాసంగా ఏర్పాటు చేసిన వారసత్వ పర్వతానికి తెస్తావు. అక్కడ వారిని నాటుతావు. యెహోవా, నీ చేతులు నిర్మించిన మందిరానికి వారిని తెస్తావు.
18 యెహోవా, శాశ్వతంగా రాజ్యం చేస్తాడు.”
19 ఫరో గుర్రాలు, రథాలు, రౌతులు సముద్రంలోకి అడుగుపెట్టగానే యెహోవా వాళ్ళ మీదికి సముద్రపు నీళ్ళు పొంగిపొరలేలా చేశాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచారు.
20 అహరోను సోదరి, ప్రవక్త్రి మిర్యాము తంబుర వాయిస్తూ బయలుదేరింది. స్త్రీలంతా తంబురలు వాయిస్తూ, నాట్యం చేస్తూ ఆమెను వెంబడించారు.
21 మిర్యాము వాళ్ళతో కలిసి ఈ విధంగా పాడింది.
మిర్యాము కీర్తన “యెహోవాను స్తుతిస్తూ పాటలు పాడండి, ఆయన ఘన విజయం సాధించాడు, శత్రువు గుర్రాలను, వాటి రౌతులను సముద్రంలో ముంచి వేశాడు.”
22 మోషే నాయకత్వంలో ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తరువాత మూడు రోజులు ప్రయాణించి షూరు ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వాళ్ళకు తాగడానికి నీళ్లు దొరకలేదు. తరువాత మారాకు చేరుకున్నారు.
23 మారాలో ఉన్న నీళ్ళు చేదుగా ఉన్నాయి కనుక ఆ నీళ్లు తాగలేకపోయారు. అందువల్ల దానికి మారా అనే పేరు వచ్చింది.
24 ప్రజలు మోషే మీద సణుగుతూ “మేమేమీ తాగాలి?” అన్నారు.
25 మోషే యెహోవాను వేడుకున్నాడు. అప్పుడు యెహోవా మోషేకు ఒక చెట్టును చూపించాడు. దాన్ని ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు తియ్యగా మారిపోయాయి. అక్కడ ఆయన వాళ్లకు ఒక కట్టుబాటును, శాసనాన్ని విధించాడు,
26 “మీరు మీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టిలో న్యాయం జరిగించి, ఆయన ఆజ్ఞలకు విధేయత కనపరచి వాటి ప్రకారం నడుచుకుంటే ఐగుప్తు వాళ్ళకు కలిగించిన ఎలాంటి జబ్బూ మీకు రానియ్యను. యెహోవా అనే నేనే మిమ్మల్ని బాగుచేసేవాణ్ణి.”
27 తరువాత వాళ్ళు ఏలీముకు చేరుకున్నారు. అక్కడ పన్నెండు నీటి ఊటలు, డెబ్భై ఈత చెట్లు ఉన్నాయి. నీళ్ళు ఉన్న ఆ ప్రాంతంలో వాళ్ళు విడిది చేశారు.