16
పరలోకం నుండి ఆహారం
1 తరువాత ఇశ్రాయేలు ప్రజలంతా ఏలీము నుండి బయలుదేరి వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన రెండవ నెల పదిహేనోరోజున ఏలీముకు సీనాయికి మధ్య ఉన్న సీను ఎడారి ప్రాంతానికి వచ్చారు.
2 అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే, అహరోనుల మీద సణుగుకున్నారు.
3 ప్రజలు వారితో “మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసం వండుకుని కుండల దగ్గర కూర్చుని తృప్తిగా భోజనం చేసేవాళ్ళం. ఆ సమయంలోనే యెహోవా చేతిలో మేము చనిపోయి ఉన్నట్టయితే బాగుండేది. మేమంతా ఆకలితో చనిపోవడం కోసం ఇక్కడికి తీసుకు వచ్చారు” అన్నారు.
4 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నేను ఆకాశం నుండి మీ కోసం ఆహారం కురిపిస్తాను. ప్రతిరోజూ ప్రజలు వెళ్లి ఆనాటికి సరిపడేటంత ఆహారం సమకూర్చుకోవాలి. వాళ్ళు నా ఉపదేశం ప్రకారం నడుచుకుంటున్నారో లేదో నేను పరిశీలిస్తాను.
5 ఆరవ రోజున వాళ్ళు మిగతా అన్ని రోజుల కంటే రెండింతలు సేకరించుకుని తెచ్చుకున్నది వండుకోవాలి.”
6 మోషే, అహరోనులు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా అన్నారు. “మీరు మా మీద ఎందుకు సణుక్కుంటారు? మేము ఎంతటి వాళ్ళం? యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన విన్నాడు.
7 ఐగుప్తు దేశం నుండి యెహోవాయే మిమ్మల్ని బయటికి రప్పించాడని సాయంత్రం నాటికి మీరు తెలుసుకుంటారు. రేపు ఉదయానికి మీరు యెహోవా మహిమా ప్రభావం చూస్తారు.”
8 మోషే వాళ్ళతో “మీరు సాయంత్రం తినడానికి మాంసం, ఉదయాన సరిపడినంత ఆహారం యెహోవా మీకు ఇస్తున్నప్పుడు మీరు ఇది తెలుసుకుంటారు. మీరు ఆయన మీద సణుక్కోవడం ఆయన విన్నాడు. మీరు సణుక్కోవడం యెహోవా మీదే, మా మీద కాదు. మాపై సణుక్కోవడానికి మేమెంతటివాళ్ళం?” అన్నాడు.
9 మోషే అహరోనులతో యెహోవా “ప్రజల సర్వ సమాజంతో ఇలా చెప్పు, ఆయన మీ సణుగులు విన్నాడు. సర్వ సమాజం అంతా యెహోవా సన్నిధికి రండి.”
10 అహరోను ఇశ్రాయేలు సమాజమంతటితో మాట్లాడుతున్న సమయంలోనే ప్రజలు ఎడారి వైపు చూశారు. అప్పుడు మేఘంలో యెహోవా మహిమ వాళ్లకు కనిపించింది.
11 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “నేను ఇశ్రాయేలు ప్రజల సణుగులు విన్నాను.
12 వాళ్ళతో ఇలా చెప్పు. సాయంత్రం పూట మీరు మాంసం తింటారు, ఉదయం పూట తృప్తిగా ఆహారం తింటారు. అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.”
13 అలాగే జరిగింది. సాయంకాలం అయినప్పుడు పూరేడు పిట్టలు వచ్చి శిబిరం అంతా కమ్ముకున్నాయి. ఉదయమయ్యాక శిబిరం అంతా మంచు పడి ఉంది.
14 నేలపై మంచు ఇంకిపోయాక నేలమీద సన్నని కణాలు పొరలుగా ఎడారి భూమి మీద కనబడ్డాయి.
15 ఇశ్రాయేలీయులు దాన్ని చూసి, అది ఏమిటో తెలియక “ఇదేంటి?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
16 మోషే వాళ్ళతో “ఇది తినడానికి యెహోవా మీకిచ్చిన ఆహారం. యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ప్రతి ఒక్కరూ తమకు అవసరమైనంత మేరకు సేకరించుకోవాలి. తమ గుడారంలో ఉన్న వాళ్ళ కోసం ప్రతి ఒక్కరికీ ఒక ఓమెరు చొప్పున తీసుకోవాలి.”
17 ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా చేశారు. అయితే కొందరు ఎక్కువగా, కొందరు తక్కువగా కూర్చుకున్నారు.
18 వాళ్ళు కొలత ప్రకారం చూసినప్పుడు ఎక్కువగా తీసుకొన్న వారికి ఏమీ మిగల్లేదు, తక్కువ తీసుకొన్నవారికి ఏమీ తక్కువ కాలేదు. ప్రతి ఒక్కరూ తమ అవసరం మేరకు తమ ఇంటి వాళ్ళ భోజనానికి సరిపడినంత సమకూర్చుకున్నారు.
19 అప్పుడు మోషే “ఉదయమయ్యే దాకా ఎవ్వరూ దీన్లో ఏమీ మిగుల్చుకోకూడదు” అని వాళ్ళతో చెప్పాడు.
20 అయితే కొందరు మోషే మాట వినకుండా తెల్లవారే దాకా దానిలో కొంచెం మిగుల్చుకున్నారు. మోషే వారిపై కోపగించుకున్నాడు. అది పురుగు పట్టి దుర్వాసన కొట్టింది.
21 కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఉదయమూ తమ ఇంటివారి కోసం ఏ రోజుకు సరిపడినది ఆ రోజు సేకరించుకున్నారు. ఎండ ఎక్కువైనప్పుడు అది కరిగిపోయింది.
22 ఆరవ రోజున వాళ్ళు ఒక్కొక్కరు రెండు లీటర్లకు రెట్టింపు లెక్క చొప్పున నాలుగు లీటర్లు సేకరించారు. ప్రజల అధికారులు వచ్చి ఆ విషయం మోషేకు చెప్పారు.
23 అందుకు మోషే “యెహోవా చెప్పిన మాట ఇదే. రేపు వివేచనాపూర్వక విశ్రాంతి దినం. అది యెహోవాకు గౌరవార్థం ఆచరించ వలసిన పవిత్ర విశ్రాంతి దినం. మీరు వండుకోవలసింది వండుకోండి, ఉడికించుకోవలసింది ఉడికించుకోండి. తినగా మిగిలినది రేపటికి ఉంచుకోండి.”
24 మోషే ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్ళు తెల్లవారే వరకూ దాన్ని ఉంచుకున్నారు. అది దుర్వాసన వేయలేదు, దానికి పురుగు పట్టలేదు.
25 అప్పడు మోషే “ఈ రోజు దాన్ని తినండి, ఈ రోజు యెహోవాకు విశ్రాంతి దినం, నేడు అది బయట మైదానంలో దొరకదు.
26 మీరు ఆరు రోజులే దాన్ని సమకూర్చుకోవాలి. విశ్రాంతి దినమైన ఏడవ రోజున అది దొరకదు” అని చెప్పాడు.
27 ఆ విధంగానే జరిగింది. ప్రజల్లో కొందరు ఏడవ రోజున దాన్ని ఏరుకోవడానికి వెళ్ళారు గానీ వాళ్లకు ఏమీ దొరకలేదు.
28 అందుచేత యెహోవా మోషేతో ఇలా అన్నాడు “మీరు ఎంతకాలం నా ఆజ్ఞలను, ఉపదేశాన్ని అనుసరించి నడుచుకోకుండా ఉంటారు?
29 వినండి, యెహోవా ఈ విశ్రాంతి దినాన్ని తప్పకుండా ఆచరించాలని సెలవిచ్చాడు. కనుక ఆరవ రోజున రెండు రోజులకు సరిపడే ఆహారం మీకు ఇస్తున్నాడు. ఏడవ రోజున ప్రతి ఒక్కరూ తమ స్థలాల్లోనే ఉండిపోవాలి.”
30 అందువలన ఏడవ రోజున ప్రజలు విశ్రాంతి తీసుకున్నారు.
31 ఇశ్రాయేలీయులు ఆ పదార్థానికి “మన్నా” అని పేరు పెట్టారు. అది తెల్లగా ధనియాల వలే ఉంది. దాని రుచి తేనెతో కలిపిన పిండి వంటకం లాగా ఉంది.
32 మోషే ఇలా చెప్పాడు “యెహోవా ఏమి చెబుతున్నాడంటే, ఈ మన్నాను ఒక ఓమెరు పట్టే పాత్రలో నింపండి. నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఎడారిలో తినడానికి మీకిచ్చిన ఈ ఆహారాన్ని మీ తరతరాల కోసం మీ వంశాల కోసం వాళ్ళు దగ్గర ఉంచుకోవాలి.”
33 అప్పుడు మోషే అహరోనుతో “నువ్వు ఒక గిన్నె తీసుకుని, దాన్ని ఒక ఓమెరు మన్నాతో నింపి, మీ తరతరాల సంతతి కోసం యెహోవా సన్నిధిలో ఉంచు” అని చెప్పాడు.
34 యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేశాడు. ఆది భద్రంగా ఉండేలా శాసనాలు ఉంచే స్థలం ఎదుట ఉంచాడు.
35 తాము చేరుకోవలసిన కనాను దేశపు సరిహద్దుల వరకూ నలభై సంవత్సరాల వాళ్ళ ప్రయాణంలో మన్నా తింటూ వచ్చారు.
36 ఓమెరు అంటే ఏఫాలో పదవ వంతు.