19
ఇశ్రాయేల్ ప్రజా సీనాయి కొండకు చేరుకోవడం
ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన మూడవ నెల మొదటి రోజున సీనాయి ఎడారి ప్రాంతానికి వచ్చారు. వాళ్ళు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి ఎడారికి వచ్చి అక్కడ పర్వతం ఎదుట ఎడారిలో విడిది చేశారు.
మోషే యెహోవా సన్నిధి ఉన్న కొండపైకి ఎక్కి వెళ్ళాడు. యెహోవా ఆ కొండపై నుండి అతణ్ణి పిలిచాడు. యెహోవా మోషేతో “నువ్వు యాకోబు సంతతితో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు.
‘నేను ఐగుప్తీయులకు ఏమి జరిగించానో, గరుడ పక్షి రెక్కల మీద మోసినట్టు మిమ్మల్ని నా దగ్గరికి ఎలా చేర్చుకొన్నానో మీరు చూశారు. ఇప్పుడు మీరు నా మాట శ్రద్ధగా విని, నా ఒడంబడిక ప్రకారం నడుచుకుంటే అన్ని దేశ ప్రజల్లో నాకు విశేషమైన ఆస్తిగా ఉంటారు. భూమి అంతా నాదే గదా. మీరు యాజక రాజ్యంగా పవిత్రప్రజగా ఉంటారు.’ నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాల్సిన మాటలు ఇవే” అన్నాడు.
మోషే కొండ దిగి వచ్చి ప్రజల పెద్దలను పిలిపించాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారికి తెలియజేశాడు. అందుకు ప్రజలంతా “యెహోవా చెప్పినదంతా మేము చేస్తాం” అని ముక్తకంఠంతో జవాబిచ్చారు. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజలు చెప్పిన మాటలను యెహోవాకు తెలియజేశాడు. యెహోవా మోషేతో “ఇదిగో నేను కారుమబ్బులో నీ దగ్గరికి వస్తున్నాను. నేను నీతో మాట్లాడుతూ ఉండగా ప్రజలు విని ఎప్పటికీ నీ మీద నమ్మకం ఉంచుతారు” అన్నాడు. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పాడు.
10 అప్పుడు యెహోవా మోషేతో “నీవు ప్రజల దగ్గరికి వెళ్లి ఈ రోజూ రేపూ వాళ్ళను పవిత్రపరచు. నా రాక కోసం వాళ్ళు సిద్ధం చెయ్యి. వాళ్ళు తమ బట్టలు ఉతుక్కుని 11 మూడవ రోజుకల్లా సిద్ధంగా ఉండాలి. మూడవ రోజు యెహోవా అనే నేను ప్రజలందరి కళ్ళెదుట సీనాయి కొండ పైకి దిగివస్తాను.
12 నువ్వు కొండ చుట్టూ హద్దు ఏర్పాటు చెయ్యి. ప్రజలతో, ‘మీరు ఈ కొండ ఎక్కకూడదు. దాని అంచును కూడా ముట్టుకోకూడదు. జాగ్రత్త. ఈ కొండను ముట్టుకున్న ప్రతివాడూ మరణశిక్షకు లోనవుతాడు. 13 ఎవ్వరూ తమ చేతులతో ముట్టుకున్న వాణ్ణి తాకకూడదు. రాళ్ళతో గానీ బాణాలతో గానీ కచ్చితంగా అతణ్ణి చంపెయ్యాలి. మనిషైనా జంతువైనా మరణ శిక్ష విధించాల్సిందే. సుదీర్ఘమైన బూర శబ్దం వినినప్పుడు వాళ్ళు కొండ పాదానికి చేరుకోవాలి’ అని చెప్పు” అన్నాడు.
14 అప్పుడు మోషే కొండ దిగి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలను పవిత్ర పరిచాడు. ప్రజలు తమ బట్టలు ఉతుక్కున్నారు. 15 అప్పుడు మోషే “మూడవ రోజుకల్లా సిద్ధంగా ఉండండి. మీ భార్యల దగ్గరికి వెళ్లొద్దు.” అని చెప్పాడు. 16 మూడవ రోజు తెల్లవారగానే ఆ కొండ మీద దట్టమైన మేఘాలు కమ్మి ఉరుములు, మెరుపులు వచ్చాయి. భీకరమైన బూర శబ్దం వినిపించినప్పుడు శిబిరంలోని ప్రజలంతా భయంతో వణకిపోయారు. 17 దేవుణ్ణి ఎదుర్కొనడానికి మోషే శిబిరంలో నుండి ప్రజలను బయటకు రప్పించాడు. ప్రజలంతా కొండ పాదం దగ్గర నిలబడ్డారు.
18 మండుతున్న మంటలతో యెహోవా సీనాయి కొండపైకి దిగి వచ్చాడు. ఆ కొండ అంతా పొగ కమ్మింది. అది కొలిమి పొగలాగా పైకి లేస్తూ ఉంది. *ఆ కొండంతా తీవ్రంగా కంపించింది. 19 ఆ బూర శబ్దం మరింత పెరుగుతూ ఉండగా మోషే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఉరుములాంటి కంఠ స్వరంతో అతనికి జవాబిస్తున్నాడు. 20 యెహోవా సీనాయి కొండ శిఖరం మీదికి దిగి వచ్చాడు. కొండ శిఖరం మీదికి రమ్మని మోషేను పిలిచినప్పుడు మోషే ఎక్కి వెళ్ళాడు.
21 అప్పుడు యెహోవా మోషేతో “ఈ ప్రజలు యెహోవాను చూద్దామని హద్దు మీరి వచ్చి వారిలో చాలా మంది నశించిపోకుండేలా నువ్వు కొండ దిగి వెళ్లి వాళ్లను కచ్చితంగా హెచ్చరించు. 22 ఇంకా నన్ను సమీపించే యాజకులు సిద్ధపడి నేను వారిని చంపకుండేలా తమను తాము పవిత్ర పరుచుకోవాలని చెప్పు” అన్నాడు.
23 అందుకు మోషే యెహోవాతో “ప్రజలు సీనాయి కొండ ఎక్కలేరు. నువ్వు కొండకు హద్దులు ఏర్పాటు చేసి దాన్ని పవిత్రంగా ఉంచాలని మాకు కచ్చితంగా ఆజ్ఞాపించావు గదా” అన్నాడు. 24 అప్పుడు యెహోవా “నువ్వు కిందకు దిగి వెళ్లు. నువ్వు అహరోనును వెంటబెట్టుకుని తిరిగి రావాలి. అయితే యెహోవా వారి మీద పడకుండా ఉండేలా యాజకులు, ప్రజలు హద్దు మీరి ఆయన దగ్గరికి ఎక్కి రాకూడదు” అని చెప్పాడు. 25 మోషే ప్రజల దగ్గరికి వెళ్లి ఆ మాట వాళ్ళతో చెప్పాడు.
* 19:18 ప్రజలంతా వణికిపోయారు