20
పది ఆజ్ఞలు
ద్వితీ 1:1-21
1 దేవుడు ఈ ఆజ్ఞలన్నిటినీ వివరించి చెప్పాడు,
2 నేను యెహోవాను, మీ దేవుణ్ణి. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న మిమ్మల్ని బయటకు తీసుకు వచ్చిన దేవుణ్ణి నేనే.
3 నేను కాక వేరే దేవుడు మీకు ఉండకూడదు.
4 పైన ఆకాశంలో గానీ, కింద భూమి మీద గానీ, భూమి కింద ఉండే నీళ్లలో గానీ ఎలాంటి ఆకారాన్నీ, ప్రతిమను తయారు చేసుకోకూడదు, వాటి ముందు సాష్టాంగపడ కూడదు, వాటిని పూజించ కూడదు.
5 ఎందుకంటే నీ దేవుడనైన నేను రోషం గలవాణ్ణి. నన్ను లక్ష్యపెట్టని వారి విషయంలో వాళ్ళ మూడు నాలుగు తరాల దాకా వాళ్ళ పూర్వికుల దుష్టత్వం వారి సంతతి పైకి రప్పిస్తాను.
6 నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించే వారిపై వెయ్యి తరాల వరకూ నా కరుణ చూపిస్తాను.
7 నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా పలకకూడదు. తన నామాన్ని వ్యర్థంగా పలికే వాణ్ణి యెహోవా దోషిగా పరిగణిస్తాడు.
8 విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించాలని జ్ఞాపకం ఉంచుకోవాలి.
9 నువ్వు కష్టపడి ఆరు రోజుల్లో నీ పని అంతా ముగించాలి.
10 ఏడవ రోజు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. ఆ రోజున నువ్వు, నీ కొడుకు, కూతురు, సేవకుడు, దాసీ, నీ ఇంట్లో ఉన్న విదేశీయుడు, నీ పశువులు ఎవ్వరూ ఏ పనీ చెయ్యకూడదు.
11 ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, సముద్రంలో ఉన్న సమస్తాన్నీ సృష్టించాడు. ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. అందువల్ల యెహోవా విశ్రాంతి దినాన్ని దీవించి తనకోసం పవిత్ర పరిచాడు.
12 నీ దేవుడైన యెహోవా మీకివ్వబోయే దేశంలో నువ్వు దీర్ఘకాలం జీవించేలా నీ తండ్రిని, తల్లిని గౌరవించాలి.
13 హత్య చెయ్యకూడదు.
14 వ్యభిచారం చెయ్యకూడదు.
15 దొంగతనం చెయ్యకూడదు.
16 నీ పొరుగువాడిపై తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు.
17 నీ పొరుగువాడి ఇల్లు గానీ, అతని భార్యను గానీ, దాస దాసీలను గానీ, అతని ఎద్దును గానీ, గాడిదను గానీ, నీ పొరుగు వాడికి చెందిన దేనినీ ఆశించకూడదు.
ప్రజల భయభీతులు
18 ప్రజలంతా ఆ ఉరుములు, మెరుపులు, భీకరమైన బూర శబ్దం, ఆ కొండ నుండి రగులుతున్న పొగ చూసి భయపడ్డారు. భయంతో దూరంగా తొలగిపోయి మోషేతో,
19 “దేవుడే గనక మాతో మాట్లాడితే మేమంతా చచ్చిపోతాం. నువ్వే మాతో మాట్లాడు, మేము వింటాం” అన్నారు.
20 అందుకు మోషే “భయపడకండి. మిమ్మల్ని పరీక్షించడానికి, ఇక నుంచి మీరు పాపం చేయకుండా ఆయన భయం మీకు ఉండేలా దేవుడు వచ్చాడు” అని ప్రజలతో చెప్పాడు.
21 ప్రజలు దూరంగా నిలబడ్డారు. మోషే దేవుడు ఉన్న కారుమబ్బుల దగ్గరికి చేరుకున్నాడు.
22 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. నేను ఆకాశంలో నుండి దిగి వచ్చి మీతో మాట్లాడాను అనడానికి మీరే సాక్షులు.
23 మీరు నన్ను ఆరాధించడానికి వెండి, లేదా బంగారపు ప్రతిమలను తయారు చేసుకోకూడదు.
బలిపీఠం
24 మట్టితో నా కోసం బలిపీఠం నిర్మించి దాని మీద మీ హోమబలులూ, శాంతిబలులూ, మీ గొర్రెలూ, ఎద్దులూ అర్పించాలి. నా పేరు గుర్తుంచుకొనేలా నేను దాన్ని ఉంచే ప్రతి స్థలం లో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.
25 ఒకవేళ మీరు నాకు రాళ్లతో బలిపీఠం నిర్మించే పక్షంలో చెక్కిన రాళ్లతో దాన్ని కట్టకూడదు, దానికి నీ చేతి పనిముట్టు తగిలితే అది అపవిత్రం అవుతుంది.
26 అంతేకాదు, నా బలిపీఠం సమీపించేటప్పుడు మీ నగ్నత్వం కనిపించకూడదు కాబట్టి మెట్ల మీదుగా ఎక్కకూడదు.”