30
1 “అయితే ఇప్పుడు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు,  
నాకన్నా చిన్నవారు,  
ఎవరి తండ్రులను నేను  
నా గొర్రెలు కాసే కుక్కలతో పెట్టడానికి అసహ్యించుకునేవాన్ని.   
2 వారి చేతుల బలం వల్ల నాకేమి ఉపయోగం?  
వారు బలం నశించిపోయిన పురుషులు.   
3 లేమితో ఆకలితో బక్కచిక్కినవారై,  
పొడిగా ఉన్న భూమిపై తిరుగులాడారు  
రాత్రివేళ నిర్జనమైన బంజరు భూములలో.   
4 ఆకుల పొదల్లో ఉప్పు మూలికలు సేకరించారు,  
బదరీ వేర్లు వారికి ఆహారము.   
5 వారు మానవ సమాజం మధ్య నుండి వెళ్లగొట్టబడ్డారు,  
వారు దొంగలైనట్టు వారిపై కేకలు వేశారు.   
6 కాబట్టి ఇప్పుడు వారు భయపెట్టే లోయల్లో,  
బండల మధ్య గుహల్లో నివసిస్తున్నారు.   
7 వారు పొదల మధ్య విరుచుకుపడ్డారు  
ముండ్లకంపల క్రింద ఒక్కటిగా పోగయ్యారు.   
8 పేరు లేని బుద్ధిహీనుల కుమారులు  
వారు దేశం నుండి తరిమివేయబడ్డారు.   
   
 
9 “అలాంటి వారికి నేను హేళన పాట అయ్యాను;  
వారికి నేను ఓ సామెతను అయ్యాను.   
10 వారు నన్ను చూసి అసహ్యించుకుని దూరంగా జరుగుతున్నారు;  
నా ముఖం మీద ఉమ్మివేయడానికి కూడా వెనుకాడరు.   
11 దేవుడు నా విల్లును విప్పి నన్ను బాధపెట్టారు,  
వారు నా సమక్షంలో సంయమనాన్ని వదిలేశారు.   
12 నా కుడి వైపున తెగ దాడులు;  
వారు నా పాదాలకు వలలు వేస్తారు,  
నాకు వ్యతిరేకంగా తమ నాశన ప్రయత్నాలను చేస్తున్నారు.   
13 నా మార్గాన్ని పాడుచేస్తున్నారు;  
నన్ను నాశనం చేయడంలో వారు విజయం సాధించారు.  
వారిని అడ్డుకునేవారు లేరు.   
14 గండిపడిన పెద్ద ప్రవాహంవలె వారు వస్తారు;  
పతనంలా వారు దొర్లుతూ వస్తారు.   
15 భయాలు నన్ను ముంచెత్తుతాయి;  
నా గౌరవం గాలిలా తరిమివేయబడింది,  
నా భద్రత మేఘంలా అదృశ్యమవుతుంది.   
   
 
16 “ఇప్పుడు నా జీవితం దూరమవుతుంది;  
శ్రమ దినాలు నన్ను పట్టుకున్నాయి.   
17 రాత్రి నా ఎముకలను పొడుస్తూ ఉంది;  
నన్ను కొరికివేస్తున్న నొప్పి ఆగడమే లేదు.   
18 తన గొప్ప శక్తితో దేవుడు నాకు దుస్తుల్లా అవుతాడు;  
నా చొక్కా మెడవలె ఆయన నన్ను బంధిస్తారు.   
19 ఆయన నన్ను బురదలో పడవేశారు,  
నేను దుమ్ము బూడిదగా అయ్యాను.   
   
 
20 “దేవా, నేను మీకు మొరపెడతాను, కాని మీరు జవాబు ఇవ్వరు;  
నేను నిలబడతాను అయినా మీరు నన్ను ఊర్కెనే చూస్తారు.   
21 నా పట్ల మీరు కఠినంగా మారారు;  
మీ బాహువు బలం చేత నా మీద దాడి చేస్తావు.   
22 నీవు నన్ను లాక్కుని గాలి ముందు నడిపిస్తావు;  
నీవు తుఫానులో నన్ను విసిరివేస్తావు.   
23 సజీవులందరి కోసం నియమించబడిన స్థలమైన,  
మరణానికి నీవు నన్ను రప్పిస్తావని నాకు తెలుసు.   
   
 
24 “విరిగిన వ్యక్తి తన బాధలో సహాయం కోసం  
కేకలు వేసినప్పుడు ఖచ్చితంగా ఎవరూ చేయి వేయరు.   
25 ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం నేను ఏడవలేదా?  
పేదవారిని చూసి నా ప్రాణం దుఃఖపడలేదా?   
26 అయినాసరే నేను మేలు జరుగుతుందని ఆశిస్తే, కీడు జరిగింది;  
నేను వెలుగు కోసం చూస్తే, చీకటి వచ్చింది.   
27 నా లోపల చిందరవందర ఎప్పుడూ ఆగదు;  
శ్రమ దినాలు నాకెదురయ్యాయి.   
28 నేను నల్లబడతాను, కాని సూర్యుని ద్వారా కాదు;  
నేను సమాజంలో నిలబడి సహాయం కోసం మొరపెడతాను.   
29 నేను నక్కలకు సోదరుడనయ్యాను,  
గుడ్లగూబలకు సహచరుడనయ్యాను.   
30 నా చర్మం నల్లబడి రాలిపోతుంది;  
నా శరీరం జ్వరంతో కాలిపోతుంది.   
31 నా వీణ దుఃఖానికి,  
నా పిల్లనగ్రోవి రోదన ధ్వనికి శ్రుతి చేయబడింది.