31
1 “యవ్వనస్త్రీని కామదృష్టితో చూడనని  
నేను నా కళ్లతో ఒడంబడిక చేసుకున్నాను.   
2 పైనున్న దేవుని నుండి మనకు ఉన్న భాగం,  
ఉన్నతస్థలంలోని సర్వశక్తిమంతుని నుండి మన వారసత్వమేమి?   
3 అది దుష్టులకు పతనం,  
తప్పు చేసేవారికి విపత్తు కాదా?   
4 ఆయన నా మార్గాలను చూడరా  
నా ప్రతి అడుగును లెక్కించరా?   
   
 
5 “ఒకవేళ నేను అబద్ధంతో నడచి ఉంటే  
మోసం వైపు నా పాదం తొందరపడి ఉంటే   
6 దేవుడు నన్ను న్యాయ త్రాసులో తూచును గాక,  
అప్పుడు నేను నిందారహితుడనని ఆయన తెలుసుకుంటారు.   
7 ఒకవేళ నా అడుగులు త్రోవ నుండి తొలగి ఉంటే,  
ఒకవేళ నా హృదయం నా కళ్ల చేత నడిపించబడి ఉంటే,  
నా చేతులు అపవిత్రం అయి ఉంటే,   
8 అప్పుడు నేను విత్తిన దానిని ఇతరులు తిందురు గాక,  
నా పంటలు పెరికివేయబడును గాక.   
   
 
9 “ఒకవేళ నా హృదయంలో నేను పరస్త్రీని చేత మోహించినా,  
నేను నా పొరుగువాని తలుపు దగ్గర వాని భార్య కోసం పొంచి ఉంటే,   
10 నా భార్య వేరొకని ధాన్యాన్ని రుబ్బును గాక,  
ఇతర పురుషులు ఆమెతో పడుకొందురు గాక.   
11 ఎందుకంటే అది దుష్టత్వం అవుతుంది,  
ఒక శిక్షించవలసిన పాపము.   
12 అది నాశనమయ్యే వరకు దహించివేసే అగ్ని;  
అది నా ఆదాయాన్ని సమూలంగా నాశనం చేసి ఉండేది.   
   
 
13 “ఒకవేళ నా పనివారిలో ఎవరికైనా,  
ఆడవారికైనా లేదా మగవారికైనా నా మీద ఆయాసం ఉన్నప్పుడు,  
నేను వారికి న్యాయం నిరాకరించి ఉంటే,   
14 దేవుడు నన్ను నిలదీసినప్పుడు నేను ఏమి చేస్తాను?  
లెక్క అప్పగించడానికి నన్ను పిలిచినప్పుడు నేను ఏమి జవాబు చెప్తాను?   
15 గర్భంలో నన్ను సృజించినవాడే వారిని కూడా సృజించలేదా?  
మా తల్లుల గర్భాల్లో మమ్మల్ని రూపించినవాడు ఒకడు కాదా?   
   
 
16 “ఒకవేళ పేదవారికి సాయం చేయకుండ నేను బిగబట్టినా  
విధవరాండ్ర కళ్లు అలసిపోయేలా చేసినా,   
17 ఒకవేళ అనాధలకు పెట్టకుండా  
నేనే ఒంటరిగా భోజనం చేసినా   
18 కాని నా యవ్వనకాలం నుండి నేను వారిని తండ్రిలా పోషించాను,  
నేను పుట్టినప్పటి నుండి విధవరాండ్రకు దారి చూపించాను;   
19 ఎవరైనా వేసుకోవడానికి బట్టలు లేక,  
కప్పుకోడానికి వస్త్రాలు లేక చావడం నేను చూసినప్పుడు,   
20 నా గొర్రెల బొచ్చుతో వారికి వేడి కలిగించాను,  
అయినా వారి హృదయాలు నన్ను దీవించలేదు,   
21 నాకు న్యాయస్థానంలో పలుకుబడి ఉందని తెలిసి,  
ఒకవేళ అనాధలకు వ్యతిరేకంగా నేను నా చేయి ఎత్తితే,   
22 అప్పుడు నా చేతులు భుజాల నుండి పడిపోవును గాక,  
దాని కీళ్ల దగ్గర విడిపోవును గాక.   
23 దేవుని నుండి వచ్చే నాశనానికి భయపడి,  
ఆయన మహాత్మ్యం పట్ల ఉన్న భయాన్ని బట్టి నేను అలాంటి వాటిని చేయలేదు.   
   
 
24 “నేను బంగారంపై నా నమ్మకాన్ని ఉంచినా,  
‘నీవే నా భద్రత’ అని మేలిమి బంగారంతో చెప్పినా,   
25 ఒకవేళ నా గొప్ప ఆస్తిని బట్టి,  
నా చేతులు సంపాదించిన ఐశ్వర్యాన్ని బట్టి నేను సంతోషిస్తే,   
26 నేను సూర్యుడిని దాని ప్రకాశంలో  
చంద్రుడు వైభవంలో కదులుతున్నట్లు భావించి,   
27 నా హృదయం రహస్యంగా ఆకర్షించబడి  
నా చేతితో గౌరవ సూచకమైన ముద్దు ఇచ్చి ఉంటే,   
28 అప్పుడు అవి కూడా తీర్పుకు తగిన పాపాలు అవుతాయి,  
ఎందుకంటే పైనున్న దేవునికి నేను నమ్మకద్రోహిని అవుతాను.   
   
 
29 “ఒకవేళ నా శత్రువు నాశనాన్ని బట్టి నేను సంతోషిస్తే  
వారికి ఏర్పడిన ఇబ్బందిని బట్టి నేను ఆనందిస్తే,   
30 వారి జీవితానికి వ్యతిరేకంగా శాపం పెట్టడం ద్వారా  
నా నోటిని పాపానికి అనుమతించలేదు   
31 ‘యోబు పెట్టిన ఆహారం తిని తృప్తి పొందనివారే ఉన్నారు?’  
అని నా ఇంటివారు ఎన్నడు అనలేదా   
32 ఏ అపరిచితున్ని రాత్రివేళ వీధుల్లో గడపనివ్వలేదు,  
ఎందుకంటే బాటసారులకు నా ఇంటి తలుపు ఎప్పుడూ తెరిచే ఉండేది   
33 మనుష్యులు చేసినట్లు, నేను నా దోషాన్ని నా హృదయంలో కప్పిపుస్తూ,  
నేను నా పాపాన్ని దాచే ప్రయత్నం చేశానా?   
34 నేను గుంపులకు భయపడి గాని  
వంశాల ధిక్కారానికి బెదిరిపోయి గాని  
నేను బయటకు వెళ్లకుండా మౌనంగా ఉండిపోయానా?   
   
 
35 “ఓహో, నేను చెప్తుంది వినడానికి నాకు ఎవరైనా ఉంటే బాగుండేది!  
నా ప్రతిపాదన మీద సంతకం పెట్టాను, సర్వశక్తిమంతుడు నాకు జవాబు చెప్పును గాక;  
నన్ను నిందించేవాడు తన అభియోగాన్ని వ్రాసి ఇచ్చును గాక.   
36 ఖచ్చితంగా నేను దానిని నా భుజం మీద ధరిస్తాను,  
నేను దానిని కిరీటంగా పెట్టుకుంటాను.   
37 ఆయనకు నా ప్రతి అడుగును గురించిన లెక్క అప్పగిస్తాను,  
పాలకునికి అయినట్టుగా నేను దానిని ఆయనకు సమర్పిస్తాను.   
   
 
38 “నా భూమి నాకు వ్యతిరేకంగా ఆక్రందన చేసి ఉంటే  
దున్నిన నేలంతా దాని కన్నీటితో తడిసిపోయి ఉంటే,   
39 వెల చెల్లించకుండా దాని పంటను మ్రింగివేసినా  
దాని యజమానులకు ప్రాణాపాయం తల పెట్టినా,   
40 అప్పుడు గోధుమలకు బదులుగా ముళ్ళపొదలు  
యవలకు బదులుగా కలుపు మొక్కలు మొలుచును గాక.”  
యోబు తన మాటలు ముగించాడు.