32
ఎలీహు 
 
1 యోబు తన దృష్టిలో తాను నీతిమంతునిగా ఉన్నాడని గ్రహించిన ఆ ముగ్గురూ అతనికి సమాధానం ఇవ్వడం మానేశారు.  
2 దేవుని కంటే తాను ఎక్కువ నీతిమంతుడని చెప్పుకుంటున్నాడని, రాము వంశస్థుడును, బూజీయుడైన బరకెయేలు కుమారుడైన ఎలీహు యోబు మీద చాలా కోప్పడ్డాడు.  
3 అతడు ముగ్గురు మిత్రులపై కూడా కోపంగా ఉన్నాడు, ఎందుకంటే వారు యోబు తప్పు అని నిరూపించడం చేతకాకపోయినా, వారు అతన్ని ఖండించారు.  
4 వారందరు తనకన్నా పెద్దవారు కాబట్టి యోబుతో మాట్లాడాలని ఎలీహు ఎదురుచూశాడు.  
5 కాని ఆ ముగ్గురు స్నేహితులు ఇంకేమి మాట్లాడకపోవడంతో అతనికి చాలా కోపం వచ్చింది.   
6 బూజీయుడైన బరకెయేలు కుమారుడైన ఎలీహు ఇలా అన్నాడు:  
నేను వయస్సులో చిన్నవాన్ని,  
మీరు పెద్దవారు;  
అందుకే నేను భయపడ్డాను,  
నేను అనుకున్నది మీతో చెప్పడానికి ధైర్యం చేయలేదు.   
7 ముందుగా వయస్సు మాట్లాడాలి;  
గడచిన సంవత్సరాలు జ్ఞానం బోధించాలని నేననుకున్నాను.   
8 అయితే అది ఒక వ్యక్తిలో ఉన్న ఆత్మ,  
సర్వశక్తిమంతుని ఊపిరి వారికి వివేచన కలిగిస్తుంది.   
9 కేవలం వృద్ధులే జ్ఞానులు కారు,  
పెద్ద వయస్సు వారే వివేచన గలవారని కాదు.   
   
 
10 కాబట్టి నేను చెప్తున్న: నేను చెప్పేది వినండి;  
నాకు తెలిసింది మీకు చెప్తాను.   
11 మాట్లాడడానికి మీరు మాటల కోసం వెదకుతున్నప్పుడు,  
మీ మాటల కోసం నేను వేచి ఉన్నాను;  
నేను మీ అభిప్రాయాలను విన్నాను,   
12 మీరు చెప్పేవాటిని నేను జాగ్రత్తగా విన్నాను;  
అయితే మీలో ఒక్కరు కూడా యోబు తప్పు అని నిరూపించలేదు;  
అతని వాదనలకు ఎవరూ జవాబు చెప్పలేదు.   
13 మాకు జ్ఞానం లభించింది;  
మనుష్యులు కాదు, దేవుడే అతన్ని తప్పు అని నిరూపించాలని మీరు అనకండి.   
14 కాని యోబు నాతో వాదించలేదు,  
మీ వాదనలతో నేను అతనికి జవాబు ఇవ్వను.   
   
 
15 వారు ఆశ్చర్యపడి ఇక ఏమి చెప్పలేదు;  
వారికి మాటలు దొరకలేదు.   
16 వారు జవాబేమి చెప్పలేదా అలా ఉండిపోయారు,  
వారు మౌనంగా ఉండగా నేను ఇంకా వేచి ఉండాలా?   
17 నేను కూడా చెప్పాల్సింది చెప్తాను;  
నేను కూడా నాకు తెలిసింది చెప్తాను.   
18 ఎందుకంటే నా మనస్సునిండ మాటలున్నాయి,  
నాలోని ఆత్మ నన్ను బలవంతం చేస్తోంది.   
19 నా అంతరంగం మూసివేసిన ద్రాక్షరసం తిత్తిలా ఉంది,  
క్రొత్త తిత్తివలె అది పగిలిపోవడానికి సిద్ధంగా ఉంది.   
20 నేను మాట్లాడి ఉపశమనం పొందాలి;  
నా నోరు తెరచి సమాధానం ఇస్తాను.   
21 నేను పక్షపాతం చూపించను,  
ఏ మనుష్యుని పొగడను;   
22 ఎలా పొగడాలో నాకు చేతకాదు. ఒకవేళ నేను అలా పొగిడితే  
వెంటనే నా సృష్టికర్త నన్ను చంపుతారు.