కీర్తన 23
దావీదు కీర్తన 
 
1 యెహోవా నా కాపరి, నాకు ఏ కొరత లేదు.   
2 పచ్చిక ఉన్నచోట ఆయన నన్ను పడుకోనిస్తారు.  
ప్రశాంత జలాల ప్రక్కన ఆయన నన్ను నడిపిస్తారు.   
3 ఆయన నా ప్రాణానికి సేదదీరుస్తారు.  
ఆయన తన నామం కోసం  
నీతి మార్గాల్లో నన్ను నడిపిస్తారు.   
4 మృత్యు నీడలా ఉన్న లోయలో  
నేను నడిచినా,  
ఏ కీడుకు భయపడను,  
ఎందుకంటే మీరు నాతో ఉన్నారు;  
మీ దండం మీ చేతికర్ర  
నన్ను ఆదరిస్తాయి.   
   
 
5 నా శత్రువులు ఉన్న చోటనే  
మీరు నాకు బల్ల సిద్ధం చేస్తారు.  
నూనెతో నా తల అభిషేకించారు;  
నా పాత్ర నిండి పొర్లుతుంది.   
6 నిశ్చయంగా నా జీవితకాలమంతా  
మీ మంచితనం మీ మారని ప్రేమ నావెంటే ఉంటాయి.  
నేను నిరంతరం  
యెహోవా మందిరంలో నివసిస్తాను.