కీర్తన 24
దావీదు కీర్తన. 
 
1 భూమి, దానిలో ఉండే సమస్తం,  
లోకం, దానిలో నివసించేవారు యెహోవా సొత్తు.   
2 ఆయన సముద్రంపై భూమికి పునాది వేశారు.  
జలాల మీద ఆయన దాన్ని స్థాపించారు.   
   
 
3 యెహోవా పర్వతాన్ని అధిరోహించగల వారెవరు?  
ఆయన పవిత్ర స్థలంలో నిలువగలవారెవరు?   
4 ఎవరి చేతులు నిర్దోషమైనవో ఎవరి హృదయం శుద్ధమైనదో,  
ఎవరు విగ్రహాల మీద నమ్మిక ఉంచరో,  
ఎవరు మోసపూరితంగా ప్రమాణాలు చేయరో, వారే కదా!   
   
 
5 వారు యెహోవా నుండి దీవెన పొందుతారు  
వారి రక్షకుడైన దేవునిచే నీతిమంతులుగా తీర్చబడతారు.   
6 ఆయనను వెదికే తరం ఇదే,  
యాకోబు దేవా, మీ ముఖకాంతిని వెదకేవారు అలాంటివారే. 
సెలా
   
   
 
7 గుమ్మాల్లారా! మీ తలలు పైకెత్తండి;  
మహిమగల రాజు ప్రవేశించేలా  
పురాతన ద్వారాల్లారా! పైకి లేవండి.   
8 ఈ మహిమగల రాజు ఎవరు?  
శక్తిమంతుడు బలశాలియైన యెహోవా,  
యుద్ధ శూరుడైన యెహోవా.   
9 గుమ్మాల్లారా! మీ తలలు పైకెత్తండి;  
మహిమగల రాజు ప్రవేశించేలా  
పురాతన ద్వారాల్లారా! పైకి లేవండి.   
10 ఈ మహిమగల రాజు ఎవరు?  
సైన్యాలకు అధిపతియైన యెహోవాయే  
ఆయనే ఈ మహిమగల రాజు. 
సెలా