కీర్తన 25
దావీదు కీర్తన. 
 
1 యెహోవా, నా దేవా,  
నేను మీపై నమ్మిక ఉంచాను.   
   
 
2 నా దేవా, నేను మిమ్మల్ని నమ్ముతాను;  
నాకు అవమానం కలగనివ్వకండి,  
నా శత్రువులకు నాపై విజయాన్ని ఇవ్వకండి.   
3 మీ కోసం ఎదురు చూసే వారెవరూ  
ఎన్నటికి సిగ్గుపరచబడరు; ఎన్నడూ ఆశాభంగం చెందరు,  
కారణం లేకుండ ద్రోహం చేసేవారి మీదకు  
అవమానం వస్తుంది.   
   
 
4 యెహోవా, మీ మార్గాలేవో నాకు చూపండి.  
మీ పద్ధతులను నాకు ఉపదేశించండి.   
5 మీ సత్యంలో నన్ను నడిపించి నాకు బోధించండి,  
మీరే నా రక్షకుడవైన నా దేవుడవు,  
మీ కోసమే రోజంతా నిరీక్షిస్తాను.   
6 యెహోవా, మీ కరుణ, మీ మారని ప్రేమ జ్ఞాపకం చేసుకోండి,  
ఎందుకంటే, అవి అనాది కాలంనాటి నుండి ఉన్నాయి.   
7 యవ్వనంలో నేను చేసిన పాపాలు,  
నా తిరుగుబాటుతనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోకండి;  
మీ మారని ప్రేమను బట్టి నన్ను జ్జాపకముంచుకోండి.  
ఎందుకంటే యెహోవా మీరు మంచివారు.   
   
 
8 యెహోవా మంచివాడు యథార్థవంతుడు;  
కాబట్టి తన మార్గాలను పాపులకు బోధిస్తారు.   
9 న్యాయమైన మార్గాల్లో దీనులను నడిపిస్తారు,  
తన మార్గాలను వారికి బోధిస్తారు.   
10 తన నిబంధనలను శాసనాలను పాటించేవారి విషయంలో  
యెహోవా మార్గాలు, ఆయన మారని ప్రేమ నమ్మదగినవి.   
11 యెహోవా, నా దోషం ఘోరమైనది  
మీ నామం కోసం నా దోషాన్ని క్షమించండి.   
   
 
12 అప్పుడు యెహోవాకు భయపడేవారికి  
వారు కోరుకోవలసిన మార్గాలను ఆయన బోధిస్తారు.   
13 వారు క్షేమం కలిగి జీవిస్తారు,  
వారి వారసులు భూమిని వారసత్వంగా పొందుతారు.   
14 ఆయన పట్ల భయభక్తులు గలవారికి యెహోవా రహస్యాలు తెలుస్తాయి;  
ఆయన తన నిబంధనను వారికి తెలియపరుస్తారు.   
15 నా కళ్లు ఎప్పుడూ యెహోవా మీద ఉన్నాయి,  
ఎందుకంటే ఆయన మాత్రమే వలలో నుండి నా పాదాలు విడిపిస్తారు.   
   
 
16 నా వైపు తిరిగి నాపై దయ చూపండి,  
నేను ఒంటరి వాడను, బాధింపబడ్డాను.   
17 నా హృదయంలో ఉన్న ఇబ్బందులు తొలగించండి  
నా వేదన నుండి విడిపించండి.   
18 నా వేదన బాధను చూడండి  
నా పాపాలన్నిటిని క్షమించండి.   
19 నా శత్రువులు ఎంతమంది ఉన్నారో చూడండి  
వారు ఎంత తీవ్రంగా నన్ను ద్వేషిస్తున్నారో చూడండి!   
   
 
20 నా ప్రాణాన్ని కాపాడండి నన్ను రక్షించండి;  
నాకు అవమానం కలగనివ్వకండి,  
ఎందుకంటే నేను మిమ్మల్నే ఆశ్రయించాను.   
21 నా నిరీక్షణ యెహోవాలోనే ఉంది,  
కాబట్టి నా నిజాయితీ యథార్థత నన్ను కాపాడతాయి.   
   
 
22 దేవా, ఇశ్రాయేలు ప్రజలను  
వారి ఇబ్బందులన్నిటి నుండి విడిపించండి.