కీర్తన 29
దావీదు కీర్తన. 
 
1 దేవ కుమారులారా, యెహోవాకు ఆపాదించండి,  
మహిమను బలాన్ని యెహోవాకు ఆపాదించండి.   
2 యెహోవా నామానికి చెందాల్సిన మహిమను ఆయనకే ఆపాదించండి;  
ఆయన పరిశుద్ధ వైభవాన్ని బట్టి యెహోవాను ఆరాధించండి.   
   
 
3 యెహోవా స్వరం సముద్రం మీద ప్రతిధ్వనిస్తుంది;  
మహిమగల దేవుడు ఉరుముతారు  
మహాజలాల మీద యెహోవా స్వరం ప్రతిధ్వనిస్తోంది.   
4 యెహోవా స్వరం శక్తివంతమైనది;  
యెహోవా స్వరం ఘనమైనది.   
5 యెహోవా స్వరానికి దేవదారు చెట్లు విరిగి పడిపోతాయి;  
లెబానోను దేవదారు చెట్లను యెహోవా ముక్కలుగా చేస్తారు.   
6 ఆయన లెబానోను పర్యతాలను దూడలా,  
షిర్యోనును అడవి దూడలా చెంగున గంతులు వేసేలా చేస్తారు.   
7 యెహోవా స్వరం  
అగ్ని జ్వాలలను పుట్టిస్తుంది;   
8 యెహోవా స్వరం ఎడారిని వణికిస్తుంది.  
యెహోవా కాదేషు అరణ్యాన్ని కదిలిస్తారు.   
9 యెహోవా స్వరం లేళ్లను ఈనజేస్తుంది  
అడవిలోని ఆకులు రాలిపోయేలా చేస్తుంది.  
ఆయన ఆలయంలోని సమస్తం ఆయనకే, “మహిమ” అంటున్నాయి.   
   
 
10 యెహోవా ప్రళయజలాల మీద ఆసీనులయ్యారు;  
ఆయనే నిరంతరం రాజుగా పరిపాలిస్తున్నారు.   
11 యెహోవా తన ప్రజలకు బలాన్ని దయచేస్తారు;  
యెహోవా సమాధానంతో తన ప్రజలను ఆశీర్వదిస్తారు.