కీర్తన 5
సంగీత దర్శకునికి. పిల్లన గ్రోవులతో పాడదగినది.దావీదు కీర్తన. 
 
1 యెహోవా, నా మాటలు ఆలకించండి,  
నా నిట్టూర్పు గురించి ఆలోచించండి.   
2 నా రాజా నా దేవా,  
సాయం కోసం నేను చేసే మొరను వినండి,  
మీకే నేను ప్రార్థిస్తున్నాను.   
   
 
3 యెహోవా, ఉదయాన మీరు నా స్వరం వింటారు;  
ఉదయాన నేను నా మనవులు మీ ముందుంచి  
ఆశతో వేచి ఉంటాను.   
4 మీరు దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కారు;  
చెడు చేసేవారికి మీ దగ్గర చోటు లేదు.   
5 అహంకారులు మీ సన్నిధిలో నిలువలేరు;  
చెడు చేసేవారందరిని  
మీరు ద్వేషిస్తారు, అబద్ధాలాడే వారిని   
6 మీరు నాశనం చేస్తారు.  
రక్తపిపాసులను మోసగాండ్రను,  
యెహోవా అసహ్యించుకుంటారు.   
7 కాని నేనైతే మీ మారని ప్రేమను బట్టి  
మీ మందిరంలోనికి రాగలను;  
మీ పరిశుద్ధాలయం వైపు తిరిగి  
నేను భక్తితో నమస్కరిస్తాను.   
   
 
8 యెహోవా, నా శత్రువులను బట్టి  
మీ నీతిలో నన్ను నడిపించండి.  
మీ మార్గాన్ని నాకు స్పష్టం చేయండి.   
9 వారి నోటి నుండి వచ్చే ఒక్క మాట కూడా నమ్మదగినది కాదు.  
వారి హృదయం అసూయతో నిండి ఉంది.  
వారి గొంతు తెరిచిన సమాధి;  
వారు నాలుకలతో అబద్ధాలు చెప్తారు.   
10 ఓ దేవా! వారిని దోషులుగా ప్రకటించండి,  
వారి పన్నాగాలే వారి పతనానికి కారణం అవ్వాలి.  
వారు చేసిన అనేక పాపాలను బట్టి వారిని వెళ్లగొట్టండి,  
వారు మీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.   
11 అయితే మిమ్మల్ని ఆశ్రయించిన వారందరు సంతోషిస్తారు;  
వారు ఎల్లప్పుడు ఆనంద గానం చేస్తారు.  
మీ నామాన్ని ప్రేమించేవారు మీలో ఆనందించేలా,  
మీరు వారిని కాపాడండి.   
   
 
12 యెహోవా, నీతిమంతులను మీరు తప్పక దీవిస్తారు;  
డాలుతో కప్పినట్లు మీరు వారిని దయతో కప్పుతారు.