కీర్తన 6
సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది.బహుశ షమినీతు ఎనిమిది తంతుల వాయిద్యం కావచ్చు.దావీదు కీర్తన. 
 
1 యెహోవా, మీ కోపంలో నన్ను గద్దించకండి  
మీ ఉగ్రతలో నన్ను శిక్షించకండి.   
2 యెహోవా, నేను బలహీనుడను, నాపై దయ చూపండి;  
యెహోవా, నా ఎముకలు వేదనలో ఉన్నాయి, నన్ను బాగుచేయండి.   
3 నా ప్రాణం తీవ్ర వేదనలో ఉంది.  
ఎంతకాలం, యెహోవా, ఇంకెంత కాలం?   
   
 
4 యెహోవా, తిరిగి రండి, నన్ను విడిపించండి;  
మీ మారని ప్రేమను బట్టి నన్ను రక్షించండి.   
5 మృతులు ఉండే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోరు  
సమాధి నుండి ఎవరు మీకు స్తుతులు చెల్లిస్తారు?   
   
 
6 మూలుగుతూ నేను అలిసిపోయాను.  
   
 
రాత్రంతా నేను కార్చిన కన్నీటిలో నా పరుపు తడిసిపోతుంది  
కన్నీటిలో నా మంచం మునిగిపోతుంది.   
7 విచారంతో నా కళ్లు మసకబారుతున్నాయి.  
నా శత్రువులందరిని బట్టి అవి క్షీణిస్తున్నాయి.   
   
 
8 యెహోవా నా మొర ఆలకించారు,  
కాబట్టి చెడు చేసేవారలారా, నా నుండి దూరంగా వెళ్లండి.   
9 కనికరం కోసం చేసిన నా మొరను యెహోవా ఆలకించారు;  
యెహోవా నా ప్రార్థన అంగీకరిస్తారు.   
10 నా శత్రువులందరు సిగ్గుపడి అధిక వేదన పొందుతారు;  
వారు హఠాత్తుగా సిగ్గుపడి వెనుదిరుగుతారు.