కీర్తన 54
సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. దావీదు ధ్యానకీర్తన. జీఫీయులు వచ్చి–దావీదు మాలో దాగి ఉండడం లేదా? అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించినది. 
 
1 ఓ దేవా, మీ నామమును బట్టి నన్ను రక్షించండి;  
మీ బలాన్నిబట్టి శిక్షా విముక్తిని చేయండి.   
2 ఓ దేవా! నా ప్రార్థన వినండి;  
నా నోటి మాటలను ఆలకించండి.   
   
 
3 అపరిచితులు నాపై దాడి చేస్తున్నారు;  
దయలేని మనుష్యులు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు  
వారు దేవుడంటే గౌరవం లేని మనుష్యులు. 
సెలా
   
   
 
4 ఖచ్చితంగా దేవుడే నాకు సహాయం;  
ప్రభువే నన్ను సంరక్షించేవారు.   
   
 
5 నన్ను దూషించే వారు భయంతో వెనుకకు మరలి వెళ్లిపోవాలి;  
మీ నమ్మకత్వాన్ని బట్టి వారిని నిర్మూలం చేయండి.   
   
 
6 యెహోవా, నేను మీకు స్వేచ్ఛార్పణలు అర్పిస్తాను;  
మీ నామాన్ని స్తుతిస్తాను, ఎందుకంటే అది మంచిది.   
7 మీరు ఇబ్బందులన్నిటి నుండి నన్ను విడిపించారు,  
నా కళ్లు నా శత్రువుల మీదికి విజయోత్సాహంతో చూశాయి.