కీర్తన 55
సంగీత దర్శకునికి.తంతివాద్యాలతో పాడదగినది. దావీదు ధ్యానకీర్తన. 
 
1 ఓ దేవా! నా ప్రార్థన ఆలకించండి,  
నా విజ్ఞప్తిని విస్మరించకండి;   
2 నా మనవి విని నాకు జవాబివ్వండి.  
నా ఆలోచనలతో నాకు నెమ్మది లేదు.   
3 నా శత్రువు నాతో అంటున్న దాన్ని బట్టి,  
దుష్టుల బెదిరింపులను బట్టి నాకు నెమ్మది లేదు;  
వారు నన్ను శ్రమ పెడుతున్నారు  
వారు వారి కోపంలో నా మీద దాడి చేస్తున్నారు.   
   
 
4 నా హృదయం నాలో వేదన పడుతుంది;  
మరణభయం నన్ను చుట్టుకుంది.   
5 భయం వణుకు నన్ను చుట్టుముట్టాయి;  
భీతి నన్ను ముంచేస్తుంది.   
6 “ఆహా, పావురంలా నాకూ రెక్కలుంటే!  
ఎగిరిపోయి హాయిగా ఉండేవాన్ని కదా!   
7 నేను దూరంగా ఎగిరిపోయి  
ఎడారిలో ఉండేవాన్ని. 
సెలా
   
8 గాలివానకు తుఫానుకు దూరంగా,  
నా ఆశ్రయ స్థలానికి తప్పించుకుని త్వరగా వెళ్తాను.”   
   
 
9 నాకు పట్టణంలో హింస, గొడవలు కనబడుతున్నాయి,  
ప్రభువా, దుష్టులను గందరగోళానికి గురి చేయండి,  
వారి మాటలను తారుమారు చేయండి.   
10 రాత్రింబగళ్ళు పట్టణ గోడల మీద శత్రువులు తిరుగుతున్నారు;  
అయితే అక్కడ దుష్టత్వం విధ్వంసం ఉన్నాయి.   
11 పట్టణంలో విధ్వంసక శక్తులు పని చేస్తున్నాయి;  
బెదిరింపులు మోసాలు దాని వీధుల్లో నిత్యం ఉంటాయి.   
   
 
12 ఒకవేళ ఒక శత్రువు నన్ను అవమానిస్తుంటే,  
నేను దానిని భరించగలను;  
నాకు వ్యతిరేకంగా శత్రువు లేస్తున్నట్లయితే,  
నేను దాక్కోగలను.   
13 కాని ఆ పని చేసిన నీవు నాలాంటి మనిషివి,  
నా సహచరుడవు, నా ప్రియ స్నేహితుడవు   
14 ఒకప్పుడు దేవుని మందిరానికి  
ఆరాధికులతో పాటు  
ఊరేగింపుగా వెళ్తున్నప్పుడు  
మనం మధురమైన సహవాసం కలిగి ఉన్నాము.   
   
 
15 చెడుతనం నా శత్రువుల నివాసాల్లో వారి హృదయాల్లో ఉంది;  
కాబట్టి మరణం ఆకస్మికంగా వారి మీదికి వచ్చును గాక,  
ప్రాణంతోనే వారు క్రింద పాతాళానికి దిగిపోవుదురు గాక.   
   
 
16 నేను మాత్రం, దేవునికి మొరపెడతాను,  
యెహోవా నన్ను రక్షిస్తారు.   
17 సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం  
నేను బాధలో మొరపెడతాను,  
ఆయన నా స్వరం వింటారు.   
18 అనేకులు నన్ను వ్యతిరేకించినప్పటికి,  
నాకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధం నుండి  
నా ప్రాణాన్ని సమాధానంలో విమోచిస్తారు.   
19 పూర్వం నుండి సింహాసనాసీనుడైయున్న మారని దేవుడు,  
అది విని వారిని అణచివేస్తారు, 
సెలా
  
వారు మారడానికి ఒప్పుకోరు  
ఎందుకంటే వారికి దేవుని భయం లేదు.   
   
 
20 నా సహచరుడు తన స్నేహితుల మీద దాడి చేసి;  
వారితో తాను చేసిన నిబంధనకు తానే భంగం కలిగిస్తాడు.   
21 అతని మాటలు వెన్నలా మృదువుగా ఉంటాయి,  
కాని అతని హృదయంలో యుద్ధం ఉంటుంది;  
అతని మాటలు నూనె కన్న నున్నగా ఉంటాయి  
కానీ అవి దూసిన ఖడ్గాల్లాంటివి.   
   
 
22 మీ భారాన్ని యెహోవాపై మోపండి  
ఆయన మిమ్మల్ని సంరక్షిస్తారు;  
నీతిమంతులను ఆయన ఎన్నడు కదలనివ్వరు.   
23 కాని దేవా, మీరు దుష్టులను  
నాశనకూపంలో పడవేస్తారు;  
రక్తపిపాసులు మోసగాళ్లు  
వారి ఆయుష్షులో సగం కూడ జీవించరు.  
   
 
కానీ నేనైతే మిమ్మల్ని నమ్ముకున్నాను.