కీర్తన 57
సంగీత దర్శకునికి. “నాశనం చేయకు” అనే రాగం మీద పాడదగినది. దావీదు శ్రేష్ఠమైన కీర్తన. గుహలో దావీదు సౌలు నుండి పారిపోయినప్పుడు, అతడు రచించినది. 
 
1 నా దేవా, నన్ను కరుణించండి, నన్ను కరుణించండి,  
ఎందుకంటే నేను మిమ్మల్ని ఆశ్రయించాను.  
విపత్తు గడిచేవరకు  
నేను మీ రెక్కల నీడలో ఆశ్రయం పొందుతాను.   
   
 
2 నా కార్యం సఫలపరచే,  
మహోన్నతుడైన దేవునికి మొరపెట్టుకుంటాను.   
3 పరలోకం నుండి సాయం పంపి నన్ను విడిపిస్తారు,  
నన్ను దిగమ్రింగాలని చూస్తూ నా మీద చాడీలు పలికే వారి బారి నుండి నన్ను తప్పిస్తారు. 
సెలా
  
దేవుడు తన మారని ప్రేమను, నమ్మకత్వాన్ని పంపుతారు.   
   
 
4 నేను సింహాల మధ్య ఉన్నాను;  
నేను క్రూరమైన జంతువుల మధ్య నివసిస్తున్నాను  
వారు ఈటెలు బాణాల వంటి పళ్ళు కలిగిన మనుష్యులు,  
వారి నాలుకలు పదునైన కత్తుల వంటివి.   
   
 
5 దేవా, ఆకాశాలకు పైగా మీరు హెచ్చింపబడాలి.  
భూమి అంతటి మీద మీ మహిమ ఉండును గాక.   
   
 
6 నా పాదాల చుట్టూ వలలు వేశారు,  
నేను బాధతో క్రుంగి ఉన్నాను  
నా దారిలో వారు గుంట త్రవ్వారు  
కాని అందులో వారే పడ్డారు. 
సెలా
   
   
 
7 ఓ దేవా, నా హృదయం స్థిరంగా ఉంది,  
నా హృదయం స్థిరంగా ఉంది;  
నేను పాడతాను సంగీతం వాయిస్తాను,   
8 నా ప్రాణమా, మేలుకో!  
సితారా వీణా, మేలుకోండి!  
ఉదయాన్ని నేను మేల్కొలుపుతాను.   
   
 
9 ప్రభువా, దేశాల మధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను  
జనాంగాల మధ్య మీ గురించి నేను పాడతాను.   
10 ఎందుకంటే మీ మారని ప్రేమ, ఆకాశాలను అంటుతుంది;  
మీ నమ్మకత్వం మేఘాలంటుతుంది.   
   
 
11 దేవా, ఆకాశాలకు పైగా మీరు హెచ్చింపబడాలి.  
భూమి అంతటి మీద మీ మహిమ ఉండును గాక.