కీర్తన 56
సంగీత దర్శకునికి. “దూరపు సింధూర వృక్షాల మీద ఉన్న ఒక పావురం” అనే రాగం మీద పాడదగినది. శ్రేష్ఠమైన దావీదు కీర్తన. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది. 
 
1 నా దేవా! నాపై దయ చూపండి,  
ఎందుకంటే నా శత్రువులు వేగంగా వెంటాడుతున్నారు;  
రోజంతా వారు తమ దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు.   
2 నా విరోధులు రోజంతా నన్ను వెంటాడుతున్నారు;  
వారి అహంకారంలో అనేకులు నా మీద దాడి చేస్తున్నారు.   
   
 
3 నాకు భయం వేసినప్పుడు, నేను మీయందు నమ్మకం ఉంచుతాను.   
4 దేవునిలో ఆయన వాగ్దానాన్ని కీర్తిస్తాను  
దేవునిలో నేను నమ్ముతాను భయపడను.  
మానవమాత్రులు నన్నేమి చేయగలరు?   
   
 
5 రోజంతా వారు నా మాటలను వక్రీకరిస్తారు;  
వారి పథకాలన్నీ నా పతనం కొరకే.   
6 నా ప్రాణం తీయాలనే ఆశతో  
వారు కుట్ర చేస్తారు, పొంచి ఉంటారు,  
నా కదలికలు గమనిస్తారు.   
7 వారి దుష్టత్వాన్ని బట్టి వారు తప్పించుకోనివ్వకండి;  
దేవా, మీ కోపంలో వారి దేశాలను కూలద్రోయండి.   
   
 
8 నా బాధలను లెక్కించండి;  
నా కన్నీటిని మీ తిత్తిలో నింపండి  
అవి మీ గ్రంథంలో వ్రాయబడలేదా?   
9 నేను మీకు మొరపెట్టినప్పుడు  
నా శత్రువులు వెనుకకు తగ్గుతారు.  
దాన్ని బట్టి దేవుడు నా పక్షాన ఉన్నాడు అని నేను తెలుసుకుంటాను.   
   
 
10 దేవునిలో, ఆయన వాగ్దానాన్ని స్తుతిస్తాను,  
అవును, యెహోవాయందు, ఆయన వాగ్దానాన్ని కీర్తిస్తాను.   
11 నేను దేవునిలో నమ్ముకున్నాను నేను భయపడను.  
మనుష్యులు నన్నేమి చేయగలరు?   
   
 
12 నా దేవా, నేను మీకు మ్రొక్కుబడులను చెల్లించాల్సి ఉంది;  
నా కృతజ్ఞత అర్పణలను మీకు చెల్లిస్తాను.   
13 ఎందుకంటే మీరు మరణం నుండి నన్ను విడిపించారు  
తొట్రిల్లకుండ నా పాదాలను  
దేవుని ఎదుట నేను జీవపువెలుగులో  
నడవడానికి శక్తినిచ్చారు.