కీర్తన 59
సంగీత దర్శకునికి. “నిర్మూలం చేయకు” అనే రాగం మీద పాడదగినది. ఒక మిక్తము. దావీదును చంపడానికి సౌలు పంపినవారు అతని ఇంటి దగ్గర పొంచి ఉన్నప్పుడు వ్రాసినది. 
 
1 దేవా! నా శత్రువుల నుండి నన్ను విడిపించండి;  
నా మీద దాడి చేసేవారికి వ్యతిరేకంగా నా కోటగా ఉండండి.   
2 కీడుచేసేవారి నుండి నన్ను విడిపించండి,  
హంతకుల నుండి నన్ను రక్షించండి.   
   
 
3 నా కోసం వారు ఎలా పొంచి ఉన్నారో చూడండి!  
యెహోవా, చేయని నేరం గాని పాపం గాని లేకుండానే  
భయంకరమైన పురుషులు నాపై కుట్ర చేస్తున్నారు.   
4 నేను ఏ తప్పు చేయలేదు, అయినా నా మీద దాడి చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు.  
నాకు సహాయం చేయడానికి లేవండి; నా దుస్థితిని చూడండి!   
5 సైన్యాల యెహోవా దేవా,  
ఇశ్రాయేలు దేవా!  
సర్వ దేశాలను శిక్షించడానికి లేవండి;  
దుష్టులైన దేశద్రోహులకు దయ చూపకండి. 
సెలా
   
   
 
6 వారు సాయంకాలం మళ్ళీ వస్తారు,  
కుక్కల్లా మొరుగుతూ,  
వేట కోసం పట్టణం చుట్టూ తిరుగుతారు.   
7 వారు వారి నోటి నుండి ఏమి చిమ్ముతారో చూడండి;  
వారి పెదవుల నుండి వచ్చే మాటలు పదునైన ఖడ్గాల్లాంటివి,  
“మా మాటలు ఎవరు వింటారు?” అని వారనుకుంటారు.   
8 కాని యెహోవా! మీరు వారిని చూసి నవ్వుతారు;  
ఆ దేశాలన్నిటిని చూసి, పరిహసిస్తారు.   
   
 
9 మీరే నా బలం, మీ కోసమే నేను వేచి ఉంటాను;  
దేవా, మీరు, నాకు ఎత్తైన కోట,   
10 తన మారని ప్రేమను బట్టి, నా దేవుడు నాతో ఉంటారు.  
   
 
ఆయన నాకు ముందుగా వెళ్తారు  
నన్ను అపవాదు చేసిన వారిపై నేను సంతోషించేలా చేస్తారు.   
11 కాని వారిని చంపకండి, ప్రభువా మా డాలు,  
వారు చస్తే నా ప్రజలు మరచిపోతారు.  
మీ బలముతో వారిని వేర్లతో పెకిలించి  
వారిని అణచివేయండి.   
12 వారి నోళ్ళ పాపాల కోసం,  
వారి పెదవుల మాటల కోసం,  
వారి గర్వంలో వారు పట్టబడుదురు గాక.  
వారు పలికే శాపాలు అబద్ధాలను బట్టి,   
13 మీ ఉగ్రతలో వారిని దహించివేయండి,  
వారు ఇక లేకుండునంతగా వారిని దహించివేయండి.  
అప్పుడు దేవుడు యాకోబును పరిపాలిస్తున్నారని  
భూదిగంతాల వరకు తెలియపరచబడుతుంది. 
సెలా
   
   
 
14 వారు సాయంకాలం మళ్ళీ వస్తారు,  
కుక్కల్లా మొరుగుతూ,  
వేట కోసం పట్టణం చుట్టూ తిరుగుతారు.   
15 వారు ఆహారం కోసం తిరుగుతారు  
సంతృప్తి చెందకపోతే కేకలు వేస్తారు.   
16 కానీ నేను మీ బలాన్ని గురించి పాడతాను,  
ఉదయం మీ ప్రేమను గురించి పాడతాను;  
ఎందుకంటే మీరు నా కోట,  
కష్ట సమయాల్లో నా ఆశ్రయము.   
   
 
17 మీరు నా బలం, నేను మీకు స్తుతిగానం చేస్తున్నాను;  
దేవా, మీరు, నా కోట,  
నన్ను ప్రేమించే నా దేవుడు.