కీర్తన 60
సంగీత దర్శకునికి. “నిబంధన పుష్పం” అనే రాగం మీద పాడదగినది. దావీదు శ్రేష్ఠమైన కీర్తన. దావీదు అరాము నహరయీము వారితోను అరాము సోబా వారితోను యుద్ధము చేయగా యోవాబు ఉప్పు లోయలో పన్నెండువేలమంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు వ్రాసినది. 
 
1 దేవా, మీరు మమ్మల్ని తిరస్కరించారు, మాపై విరుచుకుపడ్డారు;  
మీరు కోపంగా ఉన్నారు మమ్మల్ని మళ్ళీ బాగుచేయండి!   
2 మీరు దేశాన్ని కంపింపజేసి దానిని చీల్చివేశారు;  
దాని పగుళ్లను పూడ్చండి, ఎందుకంటే అది కంపిస్తూ ఉంది.   
3 మీరు మీ ప్రజలకు కఠిన సమయాలను చూపించారు;  
మమ్మల్ని తడబడేలా చేసే మద్యాన్ని మీరు మాకు ఇచ్చారు.   
4 సత్యం నిమిత్తం ఎత్తి పట్టుకోవడానికి  
మీకు భయపడేవారికి మీరొక జెండాను ఇచ్చారు. 
సెలా
   
   
 
5 మీరు ప్రేమించేవారు విడిపించబడేలా,  
మీ కుడిచేతితో మమ్మల్ని రక్షించి మాకు సాయం చేయండి.   
6 దేవుడు తన పరిశుద్ధాలయం నుండి మాట్లాడిన మాట:  
“విజయంతో నేను షెకెమును పంచుతాను  
సుక్కోతు లోయను కొలుస్తాను.   
7 గిలాదు నాది, మనష్షే నాది;  
ఎఫ్రాయిం నా శిరస్త్రాణం,  
యూదా నా రాజదండం.   
8 మోయాబు నా కాళ్లు కడుక్కునే పళ్లెం,  
ఎదోము మీద నా చెప్పు విసిరివేస్తాను,  
ఫిలిష్తియా గురించి విజయధ్వని చేస్తాను.”   
   
 
9 కోటగోడలు గల పట్టణానికి నన్నెవరు తీసుకెళ్తారు?  
ఎదోముకు నన్నెవరు నడిపిస్తారు?   
10 దేవా, ఇప్పుడు మమ్మల్ని విసర్జించింది మీరు కాదా?  
మా సేనలతో వెళ్లక మానింది మీరు కాదా?   
11 శత్రువుకు వ్యతిరేకంగా మాకు సహాయం చేయండి,  
ఎందుకంటే మనుష్యుల సహాయం పనికిరానిది.   
12 దేవునితో కలిసి మేము విజయం సాధిస్తాం,  
ఆయన మా శత్రువులను అణగద్రొక్కుతారు.